రీతబ్రత బెనర్జీ నేతృత్వంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లోని తిరుగుబాటు వర్గం కోల్‌కతా మెట్రోపాలిటన్ ప్రాంతంలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఫిర్హాద్ హకీం, సందీపన్ సాహా, జావేద్ ఖాన్, పార్టీ కోశాధికారి అక్రుజ్జమాన్‌లతో సహా పలువురు ఎమ్మెల్యేలు వెంటరాగా ఈ బృందం ఆ ప్రాంగణంలోకి ప్రవేశించి, గేట్ల తాళాలను మార్చి, కొత్త పోస్టర్లను అంటించి, లోపల సమావేశం నిర్వహించింది.
పార్టీ ప్రధాన కార్యాలయంగా ఆ భవనం నుంచే తాము కార్యకలాపాలు నిర్వహిస్తామని వారు ప్రకటించారు. ఆ కార్యాలయంతో తృణమూల్ కాంగ్రెస్‌కు భావోద్వేగ అనుబంధం ఉందని అక్రుజ్జమాన్ చెప్పారు. యజమానులతో ఒప్పందం పూర్తయిందని, ఇకపై అన్ని సంస్థాగత పనులు అక్కడి నుంచే జరుగుతాయని ఆయన తెలిపారు. సీనియర్ ఎమ్మెల్యే అరూప్ రాయ్‌ను టీఎంసీ ఛైర్మన్‌గా పేర్కొంటూ మెయిన్ గేట్ వద్ద రెబల్స్ ఒక పోస్టర్‌ను కూడా అంటించారు.
భవనం లోపల ఉన్న మమతా బెనర్జీ ఫోటోలు, కటౌట్‌లను యథాతథంగా ఉంచారు. శనివారం నుంచి తమ వర్గం అధికారికంగా ఆ కార్యాలయం నుంచే కార్యకలాపాలు ప్రారంభిస్తుందని రీతబ్రత బెనర్జీ తెలిపారు. ‘‘మేము తృణమూల్ కాంగ్రెస్. ఇదే మా ప్రధాన కార్యాలయం’’ అని ఆయన పేర్కొన్నారు. టీఎంసీ అసలు ఆఫీసును పునర్నిర్మించే సమయంలో అక్కడికి మారిన తర్వాత, 2022 నుంచి ఈ కార్యాలయం తృణమూల్ కార్యకలాపాల ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది.
కేంద్ర ఎన్నికల కమిషన్ పూర్తిస్థాయి ధర్మాసనాన్ని కలిసేందుకు రీతబ్రత బెనర్జీ, ఆయన సహచరులు ఢిల్లీని సందర్శించిన మర్నాడు ఈ చర్య చోటుచేసుకుంది. పార్టీ పేరు, గుర్తు, సంస్థాగత నిర్మాణం, ఆస్తులపై తమ వాదనలను ఆ ప్రతినిధి బృందం గట్టిగా వినిపించింది. రెబల్స్ ప్రతినిధి బృందంతో గురువారం జరిగిన సమావేశం తర్వాత సంస్థాగత ఎన్నికలు, అధికారిక సంతకాలు చేసేవారు, పార్టీ నియంత్రణపై పత్రాలు, ప్రతివాదనలను జులై 6వ తేదీ సాయంత్రం 5.30 గంటలలోపు సమర్పించాలని కోరుతూ ఎన్నికల సంఘం రెండు వర్గాలకూ లేఖ రాసింది.
కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్న వార్త వ్యాపించడంతో మమతా బెనర్జీ విధేయులైన ఎమ్మెల్యేలు కార్యాలయానికి చేరుకున్నారు. గేట్లు తాళం వేసి ఉండటంతో వారు లోపలికి ప్రవేశించలేకపోయారు. ఈ సంఘటన దురదృష్టకరమని సీనియర్ తృణమూల్ నాయకుడు కునాల్ ఘోష్ అభివర్ణించారు. పార్టీకి చెందిన ఏ ఎమ్మెల్యేకైనా పార్టీ కార్యాలయానికి వచ్చే హక్కు ఉందని, మరి తాళాలు ఎందుకు వేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
‘‘తృణమూల్ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా వారి అవసరాలను పట్టించుకోని ఈ వ్యక్తులు తమ నియోజకవర్గాలకు వెళ్లరు. దానికి బదులుగా వేరొకరి చేతిలో కీలుబొమ్మలుగా మారి ఇదంతా చేస్తున్నారు’’ అని ఘోష్ విమర్శించారు. అయితే, ఆఫీసును స్వాధీనం చేసుకోవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల పరోక్ష మద్దతు ఉందని మమతా బెనర్జీ వర్గం ఆరోపించింది. ఈ ఆరోపణను రెబల్స్ ఖండించారు.
“మేము పోలీసులకు విజ్ఞప్తి చేసినప్పటికీ, వారు చొరబాటుదారులను ఆవరణకు తాళం వేయడానికి అనుమతించి, ఆ తాళాన్ని కాపాడటానికి కాపలాగా నిలబడ్డారు. లోపలికి ప్రవేశించడానికి సౌకర్యం కల్పించమని మేము పోలీసులను కోరినప్పుడు, స్థానిక పోలీసులు, ఆర్‌ఏఎఫ్, కేంద్ర బలగాలు కేవలం అక్కడే నిలబడిపోయాయి,” అని కునాల్ ఘోష్ తెలిపారు.
గత నెలలో సమావేశమైన రెబల్స్ సమాంతర జాతీయ నాయకత్వ నిర్మాణాన్ని ప్రకటిస్తూ అరూప్ రాయ్‌ను ఛైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవికి మమతా బెనర్జీ ప్రతిపాదించిన అభ్యర్థిని తిరస్కరించి, రీతబ్రత బెనర్జీకి 58 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఇప్పుడు తమకు సుమారు 65 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉందని తిరుగుబాటు వర్గం చెబుతోంది.

More Stories
“అమిత్ అటల్” డాక్యూమెంటరీ ఆవిష్కరించిన హోసబలే, డా. జోషి
గుజరాత్లో 8 మంది ‘జైషే’ ఉగ్రవాదుల అరెస్ట్
పంజాబ్ కాంగ్రెస్ లో అసమ్మతి.. బీజేపీలో ఎవరైనా చేరవచ్చు