ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటలను గుర్తుచేసుకుంటూ, ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్, “ప్రతి భారతీయుడు ప్రత్యేకమైనవాడు. ప్రతి భారతీయుడు ఒక విఐపి. సేవే పరమ ధర్మం” అని తెలిపారు. న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి భవన్‌లో “విఐపి కల్చర్ ఇన్ ఇండియా: పవర్, ప్రివిలేజ్ అండ్ ది డిస్టెన్స్ ఫ్రమ్ డెమోక్రసీ” అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ పుస్తక రచయితలు, అరుణాచల్ ప్రదేశ్ మాజీ రాజ్యసభ సభ్యుడు నబమ్ రెబియా, సహ రచయిత సందీప్ కుమార్ అన్వేషించిన అంశం, భారతదేశంలో ప్రజాస్వామ్య పాలన, ప్రజా జీవితం మూలాలను తాకుతుందని ఆయన చెప్పారు. న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం ఆధారంగా ఒక సమాజాన్ని రాజ్యాంగం ఆకాంక్షిస్తుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
ప్రజా పదవిని ఒక ప్రత్యేక హక్కుగా కాకుండా బాధ్యతగా చూసినప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని, పౌరులకు, ప్రజా అధికారం అప్పగించిన వారికి మధ్య ఉన్న సంబంధంలోనే ప్రజాస్వామ్య సారం ఉందని ఆయన నొక్కిచెప్పారు. గొప్ప తమిళ సాధు-కవి తిరువళ్లువర్‌ను ఉటంకిస్తూ, నిజమైన నాయకత్వం ప్రజలకు అందుబాటులో ఉండటం, కరుణ, జవాబుదారీతనం వంటి లక్షణాలను కలిగి ఉంటుందని ఉపరాష్ట్రపతి తెలిపారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి పట్ల గౌరవంగా ప్రవర్తించే నాయకులు శాశ్వతమైన విశ్వాసాన్ని, అభిమానాన్ని పొందుతారని ఆయన చెప్పారు. ప్రజా పదవిని ఒక ప్రత్యేక హక్కుగా కాకుండా, సేవకు ఒక సాధనంగా చూడాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను ఈ పుస్తకంలో చర్చించిన అంశాలు ప్రతిధ్వనిస్తున్నాయని రాధాకృష్ణన్ తెలిపారు.
ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన రెడ్ బీకన్ లైట్లను రద్దు చేయాలన్న ప్రధానమంత్రి నిర్ణయాన్ని, ట్రాఫిక్ ఆంక్షల వల్ల నీట్ అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయన ఇటీవల తన ప్రయాణాన్ని ఆలస్యం చేయడాన్ని ప్రస్తావిస్తూ, ఇటువంటి చర్యలు పౌరకేంద్రిత పాలనకు నిదర్శనమని, ప్రజా అధికారం పౌరులకు సేవ చేయడానికే ఉందనే సూత్రాన్ని బలోపేతం చేస్తాయని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు.
మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి,యు ఇతర ప్రముఖుల నిరాడంబరతను, ప్రజాసేవా స్ఫూర్తిని ఈ పుస్తకంలో ప్రస్తావించడాన్ని కూడా ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఉపనిషత్తులు, రామచరితమానస్సు, బుద్ధ భగవానుడి బోధనలు, పంచతంత్రంతో సహా భారతదేశ నాగరిక, మేధో సంప్రదాయాల ప్రస్తావనల ద్వారా రచయితలు తమ విశ్లేషణను సుసంపన్నం చేశారని ఆయన పేర్కొన్నారు.
గణతంత్రాన్ని నిర్వచించే విలువలకు నూతనంగా కట్టుబడి ఉండాలని పిలుపునిస్తూ, చట్టం ముందు సమానత్వం, ప్రతి పౌరుడి గౌరవం, వినయం, బాధ్యతతో కూడిన ప్రజా సేవ ఉండాలని ఉపరాష్ట్రపతి నొక్కి చెప్పారు. నాయకత్వానికి నిజమైన కొలమానం అది సంపాదించే విశ్వాసం, అది అందించే సేవలోనే ఉందని ఆయన తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నబం తుకీ, మాజీ ఎంపీ శ్డబ్ల్యు ఆర్ ఖర్లూఖి కూడా పాల్గొన్నారు.

More Stories
థేమ్స్ తీరంలో తొలిసారిగా గంగా హారతి
రామాయణం తొలి పోస్టర్, ‘జై జై రామ్’ పాట విడుదల
బ్రిక్స్ విందుకు ప్రతిపక్ష ముఖ్యమంత్రుల గైరాజర్!