బంగ్లాదేశ్ చైనా జె-10సీఈ యుద్ధ విమానాల కొనుగోలు?

బంగ్లాదేశ్ చైనా జె-10సీఈ యుద్ధ విమానాల కొనుగోలు?
 
* భారత్ సరిహద్దుకు కూతవేటు దూరంలో మోహరించే ప్రయత్నాలు
 
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ తన చైనా అధికారిక పర్యటనలో భాగంగా జూన్ 25న చైనా ప్రధాని లీతో, జూన్ 26న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నారు. బంగ్లాదేశ్ జె-10సిఇ ఫైటర్ జెట్‌ను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదిత ప్రణాళిక, తుది చర్చలు ఇరు దేశాల మధ్య సంప్రదింపులలో కీలక అంశమని ఎన్‌డిటివికి వర్గాలు ధృవీకరించాయి. 
 
ఈ చర్య భారతదేశానికి వ్యతిరేకంగా ఒక కొత్త ద్వంద్వ వాయు యుద్ధ పరిస్థితిని సృష్టించగలదని భద్రతా విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్థాన్ కూడా ఈ ఫైటర్ జెట్‌లను ఉపయోగిస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో వీటిని భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగించినట్లు సమాచారం. ఆ ఆపరేషన్‌లో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) పాకిస్థాన్ నుండి ఎదురయ్యే ఉగ్రవాద ముప్పులను సమర్థవంతంగా అణచివేసింది. 
 
24 చైనీస్ జె-10సిఇ మల్టీరోల్ ఫైటర్ జెట్‌లను కొనుగోలు చేసే ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని బంగ్లాదేశ్ నిర్ణయించింది. ఈ ఒప్పందం ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ చైనా పర్యటనలో ఒక కీలక ఫలితంగా ఉంటుందని భావిస్తున్నారు. రక్షణ, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల రంగాలలో ఇరు దేశాలు సహకారాన్ని పెంపొందించుకుంటున్నందున, 2026 ఆగస్టు నాటికి ఈ ఫైటర్ జెట్ కొనుగోలును ఖరారు చేయాలని ఢాకా ఆశిస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.
 
జె-10సిఇ జెట్ అనేది చైనా యొక్క అధునాతన జె-10సి ఫైటర్ ఎగుమతి వెర్షన్. ఈ కొనుగోలుతో, ఈ ప్రత్యేక విమానాన్ని నడిపే పాకిస్తాన్ తర్వాత బంగ్లాదేశ్ రెండవ విదేశీ దేశంగా నిలుస్తుంది. ఈ ఒప్పందంలో ఒక్కో విమానం విలువ సుమారు 40 మిలియన్ డాలర్లు ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి. కొనుగోలు ఒప్పందం తుది వివరాలపై చైనా, బంగ్లాదేశ్ అధికారులు ఇంకా చర్చలు జరుపుతున్నారని వర్గాలు చెబుతున్నాయి. 
 
ఈ కొనుగోలును బంగ్లాదేశ్ వైమానిక దళానికి ఒక ప్రధానమైన, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆధునీకరణ చర్యగా పరిగణిస్తున్నారు. ఇది వారి వాయు-పోరాట సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుంది. అంతేకాకుండా, ఈ చర్య దక్షిణాసియాకు వ్యూహాత్మక పరిణామాలను కూడా కలిగి ఉంది. ఇది బంగ్లాదేశ్, చైనాల మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది.
 
పైగా,  బంగాళాఖాతంలో ప్రాంతీయ వాయుశక్తి సమతుల్యతను మార్చే అవకాశం ఉంది. భారతదేశం విషయానికొస్తే, న్యూఢిల్లీ నిశితంగా గమనించే రెండు పరిణామాలు ఉన్నాయి. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరి, విమానాలు చివరికి బంగ్లాదేశ్‌కు చేరుకుంటే, వాటిని ఎక్కడ మోహరిస్తారనేది అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. 
 
రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి మిత్రరాజ్యాల వైమానిక స్థావరమైన ఉత్తర బంగ్లాదేశ్‌లోని లాల్‌మోనిర్‌హాట్ ఎయిర్‌బేస్ (బిఎఎఫ్ స్టేషన్ లాల్మొనిర్‌హాట్)ను తిరిగి తెరవనున్నట్టు బంగ్లాదేశ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ వైమానిక స్థావరం భారత సరిహద్దుకు కేవలం 12-15 కిలోమీటర్ల దూరంలో, వ్యూహాత్మకంగా ముఖ్యమైన సిలిగురి కారిడార్‌కు సమీపంలో ఉంది. ఈ వైమానిక స్థావరం పునరుద్ధరణకు చైనా సహాకారంపై కూడా చర్చలు జరిగాయి. ఈ స్థావరంలో కొత్త యుద్ధ విమానాల హ్యాంగర్ల నిర్మాణం వంటి ఆధునీకరణ పనులు కూడా చేపట్టారు.
 
భారత సరిహద్దుకు సమీపంలో విదేశీ శక్తి ఉనికి వ్యూహాత్మకంగా ముప్పుగా మారే అవకాశం ఉన్నందున భద్రతాపరమైన ఆందోళనలు పెరిగాయి. దీనిపై ఆగస్టు 8, 2025న లోక్‌సభలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ మాట్లాడుతూ ‘‘బంగ్లాదేశ్‌లోని లాల్‌మోనిర్‌హాట్ వైమానిక స్థావరానికి సంబంధించిన నివేదికలను భారత ప్రభుత్వం గమనించింది. మే 26న బంగ్లాదేశ్ సైన్యం మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ మీడియా సమావేశాన్ని కూడా ప్రభుత్వం గమనించింది” అని తెలిపారు. 
 
“ఆ సమావేశంలో లాల్‌మోనిర్‌హాట్ ఎయిర్‌బేస్ సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగించేందుకు ప్రస్తుతం ఎలాంటి ప్రణాళికలు లేవని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం జాతీయ భద్రతపై ప్రభావం చూపే అన్ని పరిణామాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, దానిని పరిరక్షించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుంది’’ అని వివరించారు.