ఆంధ్ర ప్రాంత సంచాలిక డాక్టర్. డి సోమేశ్వరి

ఆంధ్ర ప్రాంత సంచాలిక డాక్టర్. డి సోమేశ్వరి
డా.టి. రాధాబాయి                                                                                                                                                               స్మృత్యంజలి 
రాష్ట్ర సేవికా సమితి

విద్యతో వికసించి సేవతో పరిమళించిన కుసుమం సోమేశ్వరి. 1952 సెప్టెంబర్ 22న నెల్లూరులో జన్మించిన ఈమె  డిగ్రీ పూర్తి చేసి పీజీ గుంటూరులో చదివారు.1974 నుండి 2010 వరకు టీజేపిఎస్ కళాశాల, గుంటూరులో బోటని అధ్యాపకురాలిగా, శాఖధిపతిగా పనిచేశారు. విద్యార్థులకు పుస్తకాలలో ఉన్న బోటనీనే కాదు బ్రతుకు బాటని కూడా నేర్పిన ఆదర్శ ఉపాధ్యాయురాలు.  ఆదర్శ సమాజ సేవిక కూడా.
 
గుంటూరులో సేవా భారతి సంస్థ స్థాపించి సేవలందించిన ప్రథములలో వీరు కూడా ఒకరు. సుమారు 12 సంవత్సరాలు బాధ్యతగా తన సేవలు అందించి కార్య విస్తరణకు ఎనలేని కృషి చేశారు. విద్య, సంస్కృతి, సేవ మూడు వేదికల మీద పనిచేసిన కర్మయోగిని ఈమె. 1976 నుండి రాష్ట్ర సేవికాసమితి సేవికగా సమాజ సేవలో ప్రారంభమైనది ఆమె జీవితం. 
 
2005లో సమితి ఆంధ్ర ప్రాంత సహకార్యవాహికగా, 2010లో ప్రాంత కార్యవాహికగా బాధ్యతలు చేపట్టారు. కాలేజీ అయిపోగానే ఆమె పని అయిపోలేదు. అప్పుడే అసలు పని మొదలయ్యేది. అదే రాష్ట్ర సేవికాసమితి కార్యము. చిత్తశుద్ధి, నిరాడంబరత , ధ్యేయనిష్ఠతో నిరంతరం కార్యరతిలో ఉండేవారు.  ఆంధ్ర ప్రాంతమంతా పర్యటించి సేవికలకు ప్రేరణను, స్ఫూర్తిని నింపేవారు.
మృదుమధురంగా సంభాషించడం, ప్రేమ ఆప్యాయతలతో ఆదరించడం ఆమె నైజం. మాతృ హృదయంతో వ్యక్తులను సంఘటిత పరచడంలో ఆమె నైపుణ్యం అద్భుతం. 
“స్త్రీ శక్తి జాగృతమైతే దేశం జాగృతమౌతుంది “అని స్వామి వివేకానంద నుడివినట్లు సోమేశ్వరి గారు శ్రీ శక్తిని జాగృతం చేశారు. ఇంటికే పరిమితమైన మహిళలను శాఖకు తెచ్చారు. ధైర్యం సంస్కారం దేశభక్తి నేర్పారు. రిటైర్మెంట్ ఉద్యోగానికే కాని సేవకు కాదు. సేవే పరమ ధర్మం అని నమ్మి జీవించారు. 
నేను అనే మాట ఆమె నోట వినిపించేది కాదు  ఎల్లప్పుడూ మనం అనేవారు. కలిసి పని చేద్దాం అనేవారు.  2019 నుండి ఆంధ్ర ప్రాంత సంచాలికగా బాధ్యతను తుది శ్వాస వరకు నిర్వర్తించారు. ఆసుపత్రి పడకపై నుండి కూడా సమితి కార్యం గురించే ఆలోచించేవారు.  గొప్పవారు చనిపోరు, వారు విత్తనాలై  మొలకెత్తుతారు. ఆమె నాటిన భావాలు, ఆమె తీర్చిదిద్దిన వ్యక్తులు అవన్నీ మహావృక్షాలై సమాజానికి నీడనిస్తాయి.
శరీరం రాలిపోవచ్చు కీర్తి రాలదు. మనిషి వెళ్ళిపోవచ్చు మంచితనం వెళ్ళదు . 74 వసంతాల పరిపూర్ణ జీవితాన్ని చవిచూశారు.  జూన్ 21 సాయంత్రం మూడు గంటలకు మృత్యువుతో పోరాడి శివైక్యం చెందారు. ఆమె చూపిన బాటలో నడవడమే ఆమెకు సమర్పించే ఘనమైన నివాళి. ఈమె భర్త డాక్టర్ జె .వి రామాంజనేయులు గారికి వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయుచున్నాము.