నెరవేరని కాంగ్రెస్ గ్యారంటీలపై వినతిపత్రం సమర్పించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదివారం ఓ బహిరంగ లేఖ వ్రాసారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ ను కలిసేందుకు సమయం ఏర్పాటు చేయమని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి వ్రాసిన లేఖకు సమాధానంగా అన్నట్లు ఈ లేఖ వ్రాసారు.
ఒకవేళ కాంగ్రెస్ నాయకత్వం స్పందించడంలో, అపాయింట్‌మెంట్ కల్పించడంలో విఫలమైతే, అది కాంగ్రెస్ తెలంగాణకు, ఇక్కడి ప్రజలకు చేసిన తీవ్ర ద్రోహమని రామచందర్ రావు స్పష్టం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలు, గ్యారంటీల ఆధారంగానే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌పై నమ్మకం ఉంచారని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అవుతునప్పటికీ మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత, వృద్ధులు, వ్యవసాయ కార్మికులు, పేద కుటుంబాలకు ఇచ్చిన పలు కీలక హామీలని ఇంకా ఎందుకు నెరవేర్చలేదని ఆ లేఖలో రావు ప్రశ్నించారు. ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వివిధ వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, నిరాశ పెరుగుతోందని చెప్పారు.
తెలంగాణ ప్రజల ఆందోళనలను, సమస్యలను నేరుగా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లేందుకు వీలైనంత త్వరగా తనకు అపాయింట్‌మెంట్ ఇప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని రాంచందర్ రావు కోరారు. మహిళలు నెలకు రూ.2,500 అందుతుందని ఆశించిన ఆర్థిక సహాయం కోసం ఇంకా ఎదురుచూస్తున్నారని, అలాగే రైతు భరోసా కింద ఎకరాకు రూ.15,000 లభిస్తుందని రైతులు ఇంకా వేచి చూస్తూనే ఉన్నారని రాంచందర్ రావు పేర్కొన్నారు.
కౌలు రైతులు, రైతు కూలీలు మరియు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు కూడా నిరాశే ఎదురవుతోందని తెలిపారు. విద్యా భరోసా పథకం కింద ఇస్తామన్న రూ.5 లక్షల సహాయం ఇంకా కార్యరూపం దాల్చలేదని, విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఇబ్బందులు పడుతూనే ఉన్నారని, నిరుద్యోగులు రాహుల్ గాంధీ పదేపదే హామీ ఇచ్చిన నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి కోసం ఇంకా ఎదురుచూస్తున్నారని ఆయన వివరించారు.
అంతేకాకుండా, వృద్ధులు నెలకు రూ.4,000 పెన్షన్ కోసం ఇంకా వేచి చూస్తుండగా, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఆర్థిక సహాయాన్ని పెంచుతామని హామీ ఇచ్చినప్పటికీ, అది ఇప్పటికీ అమల్లోకి రాలేదని పేర్కొన్నారు. కాలేజీకి వెళ్లే అమ్మాయిలు కూడా తమకు ఇస్తామన్న ఉచిత స్కూటర్ల కోసం ఇంకా వేచి చూస్తున్నారని, నిరుద్యోగ యువత జాబ్ క్యాలెండర్ మరియు ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారని తెలిపారు.

More Stories
విరాళాల దుమారంపై సీఎం యోగికి సిట్ ప్రాథమిక నివేదిక
పంజాబ్‌లో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది
ఉద్ధవ్ శివసేన తర్వాత చీలిక దిశగా శరద్ పవర్ ఎన్సీపీ?