రాహుల్ గాంధీ ఆదాయం, విదేశీ పర్యటనల ఖర్చుల్లో వ్యత్యాసం

రాహుల్ గాంధీ ఆదాయం, విదేశీ పర్యటనల ఖర్చుల్లో వ్యత్యాసం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వచ్చే వార్షిక ఆదాయాలకు, ఆయన విదేశీ పర్యటనలకు చేస్తున్న ఖర్చులకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర తెలిపారు. విదేశీ పర్యటనల్లో ఖర్చు చేస్తున్న నిధుల మూలాలను రాహుల్ వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ గత 22 ఏళ్లలో 54 విదేశీ పర్యటనలకు వెళ్లారని, వాటి మొత్తం ఖర్చు రూ.60 కోట్ల దాకా అయిందని ఆయన చెప్పారు.

కానీ కాంగ్రెస్ అగ్రనేత గత పదేళ్లలో ఫైల్ చేసిన ఎన్నికల అఫిడవిట్లలో ప్రకటించిన వార్షిక ఆదాయాలన్నీ కలుపుకున్నా రూ.11 కోట్లకు మించి ఉండవని సంబిత్ పాత్ర తెలిపారు. అయితే, ఈ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ మండిపడుతూ  మోదీ సర్కారు వైఫల్యాల నుంచి ప్రజల చూపును మళ్లించడానికి, కేంద్ర మంత్రి పదవి కోసమే సంబిత్ పాత్ర ఇలాంటి ఆరోపణలు చేశారని విమర్శించారు.

“రాహుల్ గాంధీ ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం, 2004లో ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 55.38 లక్షలు. 2024 నాటికి మొత్తం ఆస్తుల విలువ రూ. 20.39 కోట్లకు పెరిగింది. అంటే గత 22 ఏళ్లలో (2004 నుంచి 2026 వరకు) ఆస్తుల విలువ రూ. 55.38 లక్షల నుంచి రూ. 20.39 కోట్లకు చేరింది. సరిగ్గా ఇదే 22 ఏళ్ల వ్యవధిలో రాహుల్ గాంధీ 54 విదేశీ పర్యటనలకు దాదాపు రూ. 60 కోట్లను ఖర్చు చేశారు” అని సంబిత్ పాత్ర తెలిపారు.

రూ. 20.39 కోట్ల ఆస్తులకు, రూ. 60 కోట్ల విదేశీ పర్యటనల ఖర్చులకు లెక్క సరిపోవడం లేదని పేర్కొంటూ ఈ విదేశీ పర్యటనలకు ఎవరు నిధులను సమకూర్చారో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.  పైగా,రాహుల్ గాంధీ తన అనేక విదేశీ పర్యటనల వివరాలను వెల్లడించలేదని చెబుతూ ఈ రహస్య పర్యటనలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ అగ్రనేతకు ఉందని ఆయన స్పష్టం చేశారు. 

“ఇది చట్టపరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనల ప్రకారం ఏ ఎంపీ, న్యాయమూర్తి లేదా ప్రభుత్వ అధికారి విదేశీ పర్యటనలకు ఏదైనా ఏజెన్సీ నిధులను సమకూరిస్తే ప్రభుత్వం, హోం వ్యవహారాల శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఒకవేళ వ్యక్తిగత ఖర్చుతో ఏదైనా విదేశీ పర్యటనకు వెళితే, దాన్ని ఆదాయపు పన్ను రిటర్న్‌లో వెల్లడించాలి” అని స్పష్టం చేశారు. 

“మీరు విదేశాల్లో ఏదైనా బహుమతి అందుకున్నా లేదా మీపై వెల్లడి చేయని విధంగా డబ్బును ఖర్చు చేసినా, అది బ్లాక్ మనీ యాక్ట్ 2015 నిబంధనల పరిధిలోకి వస్తుంది. రాహుల్ తన విదేశీ పర్యటనల కోసం హోం శాఖ నుంచి ముందస్తు అనుమతిని పొందారా? ఆ పత్రాలు ఎక్కడ ఉన్నాయి? ఆయన ఆదాయపు పన్ను వివరాలను వెల్లడించారా?” అని సంబిత్ పాత్ర ప్రశ్నలు సంధించారు.

ఇలా ఉండగా, 2025 సెప్టెంబరులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సీఆర్పీఎఫ్ ఒక లేఖ రాసిందని, 2024 డిసెంబరు నుంచి 2025 సెప్టెంబరు మధ్య కాలంలో రాహుల్ గాంధీ చేసిన ఆరు అప్రకటిత విదేశీ పర్యటనలపై సీఆర్పీఎఫ్ అభ్యంతరాలు వ్యక్తం చేసిందని ఆయన తెలిపారు. ఈ పర్యటనలన్నీ ఎస్పీజీ రక్షణకు సంబంధించిన ఎల్లో బుక్ నిబంధనలను ఉల్లంఘించి జరగడంతో అత్యంత ఆందోళనకరమైన అంశమని ఈ లేఖలో సీఆర్పీఎఫ్ పేర్కొందని ఆయన చెప్పారు. 

 
“2026 మే 3న రాత్రి ఒమన్‌లోని మస్కట్‌లో రాహుల్ చేసిన వ్యక్తిగత పర్యటనకు సంబంధించిన దృశ్యాలను అందించాలని మేం కోరుతున్నాం. మస్కట్‌లో తనకు ఆతిథ్యం ఇచ్చిన వారి వివరాలను కానీ, పర్యటన ప్రణాళికను కానీ కాంగ్రెస్ అగ్రనేత వెల్లడించలేదు. ఇంతకీ ఆయనను అక్కడికి ఎవరు ఆహ్వానించారు? ఎఫ్‌సీఆర్‌ఏ సెక్షన్ 6 కింద ఎలాంటి అనుమతినీ తీసుకోకుండా చేసిన పర్యటన అది” అని సంబిత్ పాత్ర ప్రశ్నించారు. 

“ఒమన్‌ పర్యటన సమాచారం రుజువైతే, అది ఎల్లో బుక్ భద్రతా నిబంధనలను ఉల్లంఘించి జరిగిన ఏడో విదేశీ పర్యటన అవుతుంది. భవిష్యత్తులో దేశానికి ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్న రాహుల్, రహస్య విదేశీ పర్యటనలు చేస్తుండటం తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది” అని విమర్శించారు. 
ఇంతకీ ఆయన ఏ ఉద్దేశంతో ఒమన్‌కు వెళ్లారు? అక్కడ ఎవరిని కలిశారు? అక్కడ దేశానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడారు? ఎలాంటి కుట్ర పన్నారు? అనేది బయటపడాలని స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం రాహుల్‌ను వదిలిపెట్టదని,  లెక్కలేనన్ని పత్రాలు, వాస్తవాలు అందుబాటులో ఉన్నాయని ఆయన హెచ్చరించారు.