సంక్షోభాల నివారణలో స్థిరత్వాన్ని అందించే బ్రిక్స్ కూటమి

సంక్షోభాల నివారణలో స్థిరత్వాన్ని అందించే  బ్రిక్స్ కూటమి

అంతర్జాతీయ సంక్షోభాల నివారణలో బ్రిక్స్ కూటమి నిర్మాణాత్మకంగా, స్థిరత్వాన్ని అందించే పాత్రను పోషిస్తుందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిక్స్‌ – 2026 ‌సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం గురువారం న్యూఢిల్లీలోని ‘భారత్ మండపం’లో ప్రారంభమైంది.  ఈ సమావేశంలో జైశంకర్‌ ‌స్వాగతోపన్యాసం చేస్తూ సైనిక ఘర్షణలు, ఆర్థిక అనిశ్చితులు, వాణిజ్య అవరోధాలు, సాంకేతికత సవాళ్లు, వాతావరణ మార్పులు ప్రపంచ స్వరూపాన్ని మార్చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ సమావేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు.

ప్రపంచ, ప్రాంతీయ పరిణామాలపై సమీక్షించుకోవడానికి, ఈ సంక్లిష్ట పరిస్థితుల్లోనూ పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునే ఆచరణాత్మక మార్గాలను వెతుక్కోవడానికి ఈ సదస్సులో జరిగే చర్చలు అవకాశాన్ని కల్పిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు సవాళ్లతో పాటు అంచనాలనూ సృష్టిస్తున్నాయని జైశంకర్ తెలిపారు.

ఇంధన భద్రత, ఆహార భద్రత, ఎరువుల లభ్యత, ఆరోగ్య వ్యవస్థలు, ఆర్థిక సహాయం పొందడం వంటి విభాగాల్లో ఏర్పడిన కొత్త సవాళ్లతో అనేక దేశాలు ఆందోళనకు గురవుతున్నాయని ఆయన చెప్పారు. బ్రిక్స్ కూటమి దేశాల ఆర్థిక వృద్ధి కొనసాగాలంటే సరఫరా గొలుసుల్లో స్థిరత్వం, మార్కెట్ల వైవిధ్యీకరణ అనే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 

ప్రపంచ రాజకీయ అస్థిరతలు, వాణిజ్య అంతరాయాలతో ఏర్పడుతున్న పర్యవసానాలను మరింత మెరుగ్గా ఎదుర్కొనేందుకు ఆచరణాత్మక మార్గాలను బ్రిక్స్ దేశాలు కనుగొనాలని ఆయన కోరారు. ఇప్పుడు సైనిక సంఘర్షణలకు పాల్పడుతున్న దేశాలు, శాంతి చర్చలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని జైశంకర్‌ చెప్పారు. ఇదే సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై బ్రిక్స్ దేశాలు అన్నింటికీ అమితమైన ఆసక్తి ఉందని తెలిపారు. 

ఉగ్రవాదంపై బ్రిక్స్ కూటమి ఉమ్మడి పోరు జరపాలని పిలుపిచ్చారు. వాతావరణ మార్పులు యావత్ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నాయని, వాతావరణ మార్పులపై బ్రిక్స్ దేశాల చర్చలు సమానత్వం, విభిన్నమైన బాధ్యతలను కలిగిన ఉమ్మడి సూత్రాలను సమర్థించే దిశగా జరగాలని కోరారు. అలాగే బ్రిక్స్ కూటమి పురోగతికి సంస్థాగతమైన సంస్కరణలు అత్యవసరమని, అధ్యక్ష హోదాలో దీనిపై భాగస్వామ్య దేశాలతో భారత్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. 

బ్రిక్స్ మంత్రులతో మోదీ భేటీ

బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరైన మంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం భేటీ అయ్యారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రోనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా, ఇతరులతో ప్రధాని కలిశారు.