‘హోర్మూజ్‌’పై మోదీకి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ ఫోన్‌

‘హోర్మూజ్‌’పై మోదీకి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ ఫోన్‌
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ ప్రధాని మోదీతో గురువారం ఫోన్లో సుదీర్ఘంగా చర్చించారు. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హోర్మూజ్‌ జలసంధిలో నౌకల రాకపోకలకు స్వేచ్ఛ, భద్రత పున రుద్ధరించాల్సిన అత్యవసర పరిస్థితి ఉందని పేర్కొన్నారు.  దాదాపు 50రోజులుగా కొనసాగుతున్న యుద్ధం ప్రపంచశాంతికి విఘాతం కలిగిస్తోందని ఇరు నేతలు అభిప్రాయపడ్డారు.
ప్రాంతీయ స్థిరత్వం కోసం భారత్‌, ఫ్రాన్స్‌ దేశాలు తమ సన్నిహిత సహకారాన్ని కొనసాగిస్తాయని, తమ సంభాషణ వివరాలను మోదీ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. అంతకుముందు మార్చి 5న కూడా మోదీ, మాక్రాన్‌లు ఫోన్లో చర్చలు జరిపారు.  పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరతకు మద్దతుగా భారత్‌-ఫ్రాన్స్‌ తమ వంతు సహకారం కొనసాగించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.  
హర్మూజ్‌ జలసంధి గుండా సురక్షిత నౌకాయానం వెంటనే పునరుద్ధరణ జరగాల్సిన అవసరం ఉందని అంగీకరించినట్లు తెలిపారు. పశ్చిమాసియా, దాని వెలుపల శాంతి, సుస్థిరత నెలకొనేందుకు ఇరుదేశాలు సహకారం కొనసాగించాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ చెప్పారు. “నా ప్రియ మిత్రుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పశ్చిమ ఆసియాలో ప్రస్తుత పరిస్థితి గురించి మేం చర్చించాం. హర్మూజ్ జలసంధిలో భద్రతను, నౌకాయాన స్వేచ్ఛను తక్షణమే పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అంగీకరించాం” అని మోదీ ఎక్స్​లో పేర్కొన్నారు.