నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో ప్రభుత్వం కుట్రకు పాల్పడుతోందన్న ప్రతిపక్షాల ఆరోపణలను అమిత్ షా తీవ్రంగా ఖండించారు. డీలిమిటేషన్ బిల్లు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని యథాతథంగా పోలిఉందని స్పష్టం చేశారు. ఇందులో తాము ఎటువంటి మార్పులు చేయలేదని,కనీసం ఒక కామా గానీ, ఫుల్‌స్టాప్ గానీ మార్చలేదని స్పష్టం చేశారు.
డీలిమిటేషన్ వల్ల ప్రస్తుతం ఉన్న ఎంపీ స్థానాలు మరో 50 శాతం పెరుగుతాయని వివరించారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం ఎలా జరుగుతుందో విపక్ష ఎంపీలు చెప్పాలని డిమాండ్ చేశారు. విపక్షాలు అసత్యాలు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. మొత్తం సీట్లలో 33 శాతం మహిళలకు రిజర్వ్ అవుతాయని, జనరల్ స్థానాల్లోనూ నారీమణులకు అవకాశం ఇస్తే చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం మరింత పెరుగుతుందని చెప్పారు.
“దేశంలో గతంలో అత్యవసర పరిస్థితిని విధించినప్పటికీ ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయడం సాధ్యం కాలేదు. ఇది భారతదేశ చరిత్ర. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే శక్తి ఎవరికీ లేదు. అలా చేయడానికి ప్రయత్నించిన వారు తగిన పర్యావసానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది” అని హెచ్చరించారు.
అత్యవసర పరిస్థితి సమయంలో దేశ ప్రజలు వారిని (కాంగ్రెస్‌ను) ఓడించారని, ప్రజాస్వామ్యానికి ఎటువంటి హానీ జరగలేదని గుర్తు చేశారు. “తమిళనాడు, బంగాల్‌లలో ఎన్నికలు జరగబోతున్నాయని, ఈ తరుణంలో ఒక కొత్త చట్టాన్ని తీసుకువచ్చారని మాపై ప్రచారం జరుగుతోంది. ఇది సరికాదు. డీలిమిటేషన్ కమిషన్ (నియోజకవర్గాల పునర్విభజన సంఘం) నివేదికను పార్లమెంట్ ఆమోదించి, దానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినప్పుడు మాత్రమే అది అమల్లోకి వస్తుంది” అని తెలిపారు.
కాబట్టి 2029కి ముందే దీనిని అమలు చేసే ప్రసక్తే లేదని అమిత్ షా స్పష్టం చేశారు. 2029 వరకు జరిగే ఎన్నికలు కూడా ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం, నియోజకవర్గాల ప్రకారమే జరుగుతాయి కాబట్టి అఖిలేశ్ యాదవ్ ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని హితవు చెప్పారు. “రాజకీయ నాయకులైనా, పార్టీలైనా 130 కోట్ల మంది ప్రజల తీర్పును తారుమారు చేయలేరు. ఒకవేళ మేము అలా చేసి ఉంటే ఎన్నికల్లో ఎప్పుడూ గెలిచేవాళ్లమే కాదు” అని అమిత్ షా స్పష్టం చేశారు.

More Stories
‘హోర్మూజ్’పై మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఫోన్
బెంగాల్లో ట్రిబ్యునల్ ఆమోదించిన వారంతా ఓటు వేయవచ్చు
ప్రపంచ వృద్ధి మందగించిగా పటిష్టంగా భారత ఆర్థిక వ్యవస్థ