అమెరికాతో కీలక వాణిజ్య చర్చల కోసం భారత అధికారుల బృందం ఏప్రిల్ 20 నుంచి వాషింగ్టన్‌ను సందర్శించనున్నట్లు అదనపు కార్యదర్శి దర్పణ్ జైన్ తెలిపారు. భారత్, అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ముసాయిదా ఇప్పటికే ఖరారైన నేపథ్యంలో ఈ ద్వైపాక్షిక భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవానికి ఈ ఒప్పందంపై ఈ ఏడాది మార్చిలోనే సంతకాలు జరగాల్సి ఉంది.
అయితే, అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పుతో అక్కడి టారిఫ్ విధానాల్లో అనూహ్య మార్పులు జరిగాయి. అమెరికా నూతన గ్లోబల్ టారిఫ్ విధానం పూర్తిగా అమల్లోకి వచ్చిన తర్వాతే ఈ ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని అధికారిక వర్గాలు గతంలోనే స్పష్టం చేశాయి. భారత్, అమెరికా మధ్య తొలిదశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ముసాయిదా ఫిబ్రవరిలో ఖరారైంది. ఈ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం, భారత్‌పై సుంకాలను 18 శాతానికి తగ్గించేందుకు అమెరికా అంగీకరించింది.
అయితే ట్రంప్ తీసుకొచ్చిన పరస్పర సుంకాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ దేశ టారిఫ్ విధానం మారిపోయింది. ఈ పరిణామాల తర్వాత, ఫిబ్రవరి 24 నుంచి 150 రోజుల పాటు అన్ని వాణిజ్య భాగస్వామ్య దేశాలపై 10 శాతం సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు, అమెరికా సెక్షన్ 301 కింద రెండు వేర్వేరు దర్యాప్తులు చేపడుతున్న తరుణంలో వచ్చే వారం వాషింగ్టన్‌లో జరగనున్న భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
ఇదిలా ఉండగా, ఫిబ్రవరిలో భారత్-అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. అందుకు సంబంధించి ఇరు దేశాలు ఓ సంయుక్త ప్రకటనను కూడా విడుదల చేశాయి. అయితే, ఆ ఒప్పందంలో భారత ఉత్పత్తులపై ఉన్న 50 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. ఇరుదేశాలకు ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్యఒప్పందం కోసం ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటుచేసినట్లు ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి.
అయితే, ఈ చర్చల్లో కీలక పాత్ర పోషించిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్ మధ్యంతర ఒప్పందాన్ని చరిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. ఆ ఒప్పందం భారతీయ ఎగుమతిదారులకు 30 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ తెరుస్తుందని, ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలు, రైతులు, మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు.

More Stories
భారతీయ రెస్టారెంట్ లకు నెలకు రూ.79,000 కోట్ల నష్టం
ప్రపంచ వృద్ధి మందగించిగా పటిష్టంగా భారత ఆర్థిక వ్యవస్థ
ఐరోపాలో ఆరు వారాలకు మాత్రమే జెట్ ఫ్యూయెల్ నిల్వలు