అగ్రదేశాలుగా వెలుగొందుతున్న ఐరోపా దేశాలు కూడా ఇరాన్- అమెరికా యుద్ధ ప్రభావంతో చమురు సమస్యను ఎదుర్కొంటున్నాయి. తాజా అంచనా ప్రకారం ఐరోపా దగ్గర ఆరు వారాలకు సరిపడా మాత్రమే విమాన ఇంధనం నిల్వలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఐఈఏ (ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ) చీఫ్ ఫాతి బిరోల్ వెల్లడించారు. ఇరాన్ యుద్ధ సంక్షోభం ఇంకొన్ని రోజులు కొనసాగితే ఐరోపా ఏవియేషన్ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇరాన్ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిని అమెరికా మూసేయడంతో యూరప్‌నకు చమురు రవాణా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో చమురు అంశంపై ఫాతి బిరోల్ మాట్లాడుతూ ఈ పరిస్థితి ఇంకొన్ని రోజులు ఇలాగే కొనసాగితే ఇంధన కొరత కారణంగా విమానాల ప్రయాణాలు రద్దయ్యే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ‘‘హార్ముజ్ జలసంధి తిరిగి తెరవకపోతే విమాన ఇంధన కొరత తలెత్తి, విమానాల రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఇంధన సంక్షోభం ఎదురుకాలేదు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర సంక్షోభం ఎదురుకానుంది” అని తెలిపారు.
హార్ముజ్ జలసంధి ఎక్కువ కాలం అందుబాటులోకి రాకపోతే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడే ఆసియా దేశాలపైనే ఎక్కువ ప్రభావం పడుతుంది. దక్షిణ కొరియా, ఇండియా, చైనా, బంగ్లాదేశ్ ముందుగా నష్టపోతాయి. తర్వాత యూరప్‌పై ప్రభావం ఉంటుంది’’ అని బిరోల్ పేర్కొన్నారు. ఇప్పటికే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
మరోవంక, ఇరాన్ యుద్ధం వైమానిక పరిశ్రమను అస్తవ్యస్తం చేయడంతో, ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సరఫరాలకు ముప్పు వాటిల్లుతోంది. కొన్ని ఆసియా విమానయాన సంస్థలు సంక్షోభంలోకి జారుకోవడంతో, విమానయాన సంస్థలు తమ విస్తరణ ప్రణాళికలను తగ్గించుకున్నాయి.
విమానయాన కన్సల్టెన్సీ సిరియం ప్రకారం, యుద్ధానికి ముందు, విమానయాన సంస్థలు ఈ ఏప్రిల్‌లో తమ సామర్థ్యాన్ని గత ఏడాదితో పోలిస్తే 5.4 శాతం పెంచాలని ప్రణాళిక వేసుకున్నాయి. ఇప్పుడు ఈ వృద్ధిని కేవలం 0.2 శాతానికి తగ్గించారు. విమానయాన సంస్థ ఖర్చులలో ఇంధనం వాటా సుమారు 30 శాతంగా ఉంటుందని, అయితే చమురు ధరలు అధిక స్థాయిలోనే కొనసాగితే ఈ నిష్పత్తి రెట్టింపు కంటే ఎక్కువగా పెరుగుతుందని తాము భావిస్తున్నట్లు ఆ సంస్థ వర్గాలు తెలిపాయి.

More Stories
భారతీయ రెస్టారెంట్ లకు నెలకు రూ.79,000 కోట్ల నష్టం
ప్రపంచ వృద్ధి మందగించిగా పటిష్టంగా భారత ఆర్థిక వ్యవస్థ
వచ్చేవారం భారత్, అమెరికా వాణిజ్య ఒప్పంద చర్చలు