ఇంగ్లండ్‌పై 336 పరుగులతో ఘన విజయం

ఇంగ్లండ్‌పై 336 పరుగులతో ఘన విజయం

అండర్సన్- తెందుల్కర్ టెస్టు సిరీస్​లో భారత్ చరిత్రాత్మక విజయం సాధించింది. దిగ్గజాలు విరాట్‌కోహ్లీ, రోహిత్‌శర్మ, అశ్విన్‌ నిష్క్రమణ తర్వాత పరివర్తన దశలో ఉన్న టీమ్‌ఇండియా ఇంగ్లండ్‌ గడ్డపై కొత్త చరిత్రకు నాంది పలికింది. ఎడ్జ్​బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన​ రెండో టెస్టులో భారత్ పరుగుల 336 తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 608 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్ 271 స్కోర్​కే ఆలౌటైంది. దీంతో ప్రస్తుత సిరీస్​ను భారత్ 1-1తో సమం చేసుకుంది.

ఈ విజయంతో గిల్ సేన టీమ్ఇండియా టెస్టు హిస్టరీలో చరిత్ర సృష్టించింది. అలాగే 25ఏళ్ల శుభ్​మన్ గిల్ సైతం ఈ విజయంతో అరుదైన ఘనత సాధించాడు. భారత్ టెస్టు ఫార్మాట్ చరిత్రలో ఇంగ్లాండ్​పై ఎడ్జ్​బాస్టన్​లో టెస్టు మ్యాచ్​ నెగ్గడం ఇదే తొలిసారి. 58 ఏళ్లలో టీమ్ఇండియా ఎడ్జ్​బాస్టన్​లో నెగ్గడం ఇదే తొలిసారి కావడం విశేషం. 1967లో టీమ్ఇండియా మొదటిసారి టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత 1974, 1979, 1986 (డ్రా) , 1996, 2011, 2018, 2022లో ఒకసారి డ్రా, మిగిలిన మ్యాచ్​లన్నింటిలో భారత్ ఓడింది.

యువ కెప్టెన్ గిల్​ అరుదైన ఘనత సాధించాడు. టీమ్ఇండియా పగ్గాలు చేపట్టిన రెండో మ్యాచ్​లోనే జట్టుకు చారిత్రక విజయం అందించాడు. ఈ మ్యాచ్​తో తనపై ఉన్న అనుమానాలకు గిల్ సరైన సమాధానం చెప్పాడు. ఎడ్జ్​బాస్టన్​లో లెజెండరీ ప్లేయర్లకు సాధ్యం కానీ విజయాన్ని, 25ఏళ్ల గిల్ అందించి వాహ్వా అనిపించుకుంటున్నాడు. కెప్టెన్​గానే కాదు ఈ మ్యాచ్​లో గిల్ బ్యాటర్​గానూ రాణించాడు. రెండు ఇన్నింగ్స్​ల్లోనూ అద్భుతంగా ఆడాడు.

తొలి ఇన్నింగ్స్​లో డబుల్ సెంచరీ బాదగా, రెండో ఇన్నింగ్స్​లో భారీ శతకంతో అదరగొట్టాడు. బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన ఆకాశ్‌దీప్‌ అంచనాలకు మించి రాణించాడు. వర్షం కారణంగా గంట విరామం తర్వాత మొదలైన ఐదో రోజు ఆటలో ఆకాశ్‌దీప్‌దే హవా. తన స్వింగ్‌ బౌలింగ్‌తో ఆకాశ్‌దీప్‌..ఇంగ్లండ్‌ టాపార్డర్‌ బ్యాటర్లకు చుక్కలుచూపెట్టాడు. బంతిని ఇరు వైపులా స్వింగ్‌ చేస్తూ వికెట్లు పడగొట్టాడు.

ఆకాశ్‌దీప్‌ విసిరిన బంతిని సరిగ్గా అర్థం చేసుకోని పోప్‌(24) వికెట్ల మీదకు ఆడుకుని నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. ఇక్కడే ఇంగ్లండ్‌ పతనానికి ఆకాశ్‌ తెరతీశాడు. మరో ఓవర్‌ తేడాతో ప్రమాదకర బ్రూక్‌(23)ను వికెట్ల ముందు ఆకాశ్‌ దొరకబుచ్చుకున్నాడు. షాట్‌ ఆడే క్రమంలో లైన్‌ మిస్సయిన బ్రూక్‌ ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.  ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ స్టోక్స్‌..స్మిత్‌కు జతకలిశాడు. వీరిద్దరు..భారత బౌలర్లను నిలువరించే ప్రయత్నం చేశారు.

వికెట్లనుక కాపాడుకుంటూ అనవసర షాట్లకు పోకుండా అడపాదడపా బౌండరీలతో స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో ఆకట్టుకున్న స్మిత్‌ పరిణతి కనబరిచాడు. వీరద్దరు క్రీజులో కుదురుకుంటారనుకున్న తరుణంలో గిల్‌ వేసిన ప్లాన్‌ వర్క్‌ఔట్‌ అయ్యింది. విదేశాల్లో టెస్టు గెలిచిన పిన్న వయసు భారత కెప్టెన్‌గా గిల్‌(25 ఏండ్ల 301 రోజులు) నిలిచాడు. పరుగుల(336) పరంగా విదేశీ గడ్డపై టీమ్‌ఇండియాకు ఇది భారీ విజయం. 2016లో విండీస్‌పై 318 పరుగులతో గెలువడమే ఇప్పటి వరకు అత్యుత్తమం.