భారత్ ప్రధాని నరేంద్ర మోదీ నినదించే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి ఏటా 10 శాతం నామమాత్రపు జీడీపీ వృద్ధి అవసరమని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) అధ్యక్షుడు రాజీవ్ మెమానీ తెలిపారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 6.4-6.7 శాతం వృద్ధి చెందుతుందని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
“మన స్థూల ఆర్థిక వ్యవస్థ మంచి స్థితిలో ఉంది. విషయాలు స్థిరంగా ఉన్నాయి. మూలధన మార్కెట్లు అయినా, అది ఆర్బిఐ అయినా, అది బ్యాంకులు అయినా అన్నీ ఉత్తమ స్థితిలో ఉన్నాయి. కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్లు బలంగా కనిపిస్తున్నాయి” అని సీఐఐ అధ్యక్షుడు తెలిపారు. ఆ తర్వాత ఒత్తిడికి లోనై భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోదని చెప్పారు. జాతి ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు.
దేశ పారిశ్రామిక వర్గాలు అమెరికాతో ఒప్పందం జరగాలని కోరుకుంటున్నాయని రాజీవ్ మెమానీ చెప్పారు. కానీ, ఇది భారత ప్రయోజనాలకు అనుగుణంగా జరగడం ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏ ఒత్తిడికి తలొగ్గి నిర్ణయం తీసుకోదని, అంచనాల ప్రకారం తాత్కాలిక ట్రేడ్ డీల్ జరగొచ్చని వెల్లడించారు. వస్త్ర పరిశ్రమ వంటి కార్మిక ఆధారిత రంగాలకు ఈ ఒప్పందంతో మేలు జరగనుందని చెప్పారు.
దీంతోపాటు ఇంజినీరింగ్ సరకులు, ఆటో విడిభాగాల రంగం, రసాయన పరిశ్రమ రంగాన్ని డీల్‌లో భాగం చేస్తే అవి లాభపడే అవకాశం ఉందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం టెక్నాలజీ బదిలీలు, మరిన్ని జాయింట్ వెంచర్లు, భాగస్వామ్యాలకు కూడా మార్గం సుగమం చేస్తుందని పేర్కొన్నారు. కాబట్టి ముందుగా ఉన్న అనిశ్చితి తొలగిపోతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ప్రజలకు స్పష్టమైన దిశానిర్దేశం లభిస్తుందని చెప్పారు. అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ప్రతీకార పన్నులపై విరామానికి ఇచ్చిన 90 రోజుల గడువు మరి కొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజీవ్ మెమాని వ్యాఖ్యలు వెలువడటం గమనార్హం. ట్రంప్ భారత్‌పై 26 శాతం టారిఫ్‌లను విధించగా, జులై 9 కంటే ముందే మధ్యంతర ట్రేడ్ డీల్‌ను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
రాజీవ్ మెమానీ ప్రత్యేకంగా ఆటోమొబైల్ రంగంలో సవాళ్లను గుర్తించినట్లు తెలిపారు. భారతదేశానికి అనుకూలమైన నిబంధనలను పొందడంలో విఫలమైతే, మెక్సికో ప్రాథమిక లబ్ధిదారుగా ఉంటుందని, వియత్నాంకు కూడా కొన్ని సంభావ్య లాభాలు ఉంటాయని మెమానీ అంచనా వేశారు. “గరిష్ఠ ప్రత్యామ్నాయం మెక్సికో నుంచి వస్తుంది. వియత్నాంకు కూడా కొంత అవకాశం ఉంటుంది” అని ఆయన అన్నారు. ప్రస్తుత వాణిజ్య సంబంధాలు భారత పోటీతత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలని ఆయన పేర్కొన్నారు.

More Stories
జలంధర్, అమృత్సర్ సైనిక కేంద్రాల వద్ద ప్రేలుళ్ళు!
కేరళ ఓటమితో దేశంలో అస్థిత్వ సంక్షోభంలో ‘లెఫ్ట్’!
కేరళంలో ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ లో పోటా పోటీ!