బీజేపీలో క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిందే

బీజేపీలో క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిందే
క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిందేనని, నిబంధనలు పాటించకుంటే ఎంతటి నాయకుడిపై అయినా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని  బిజెపి పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు రామచందర్ రావు గట్టిగా హెచ్చరించారు. తెలంగాణ బీజేపీలో ఇటీవల అసమ్మతి స్వరాలు వినిపించడాన్ని ప్రస్తావిస్తూ  పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా నష్టపోయేది ఏమీ లేదని ఆయన తేల్చి చెప్పారు. 
 
“బీజేపీఐలో సిద్ధాంతం, క్రమశిక్షణ ముఖ్యం. పార్టీ కంటే ఏ ఒక్క నాయకుడూ గొప్ప కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి” అని స్పష్టం చేశారు.
పార్టీ నియమాలను ఉల్లంఘించినందుకు ఒకప్పుడు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడైన బల్ రాజ్ మదోక్‌ను సైతం సస్పెండ్ చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 
 
పార్టీ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన పునరుద్ఘాటించారు. ఇటీవల గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేసిన తరుణంలో రామచందర్ రావు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న `సామజిక న్యాయం సమరభేరి’ సభపై కూడా ఆయన తన సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సభ కేవలం సామాజిక న్యాయాన్ని దెబ్బతీయడానికేనని ఆయన ఆరోపించారు. 
కాంగ్రెస్ పార్టీ దోపిడీకి తెలంగాణ ఒక అక్షయపాత్రగా మారిపోయిందని రామచందర్ రావు ధ్వజమెత్తారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ దోపిడీకి అక్షయపాత్రలుగా మారాయని పేర్కొంటూ ఏడాదిన్నర కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఒక్క హామీని కూడా సమర్థంగా అమలు చేయలేకపోందని, ప్రజలకు ఏం సమాధానం చెబుతుందని ఆయన నిలదీశారు.
తెలంగాణలో 6 గ్యారంటీలు, 13 హామీలు అంటూ భారీగా హడావుడి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఏ హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయిందని ధ్వజమెత్తారు.  కుల గణన పేరిట బీసీలకు అన్యాయం చేసి, ముస్లింలను బీసీ కోటా లో చేర్చడమే కాంగ్రెస్ సామాజిక న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ఈ సభ నిర్వహించేది సామాజిక న్యాయం కోసం కాదు, సామాజిక న్యాయానికి తూట్లు పొడవడానికేనని ఎద్దేవా చేశారు. 

తెలంగాణ ప్రజలు మళ్లీ మోసపోరని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేయని విషయాన్ని మరిచినట్టుగా మల్లికార్జున ఖర్గే తెలంగాణకు వచ్చారని చెప్పారు. కానీ ప్రజల మనసులో ఉన్న అసలైన ప్రశ్న ఒక్కటే ఖర్గే, కాంగ్రెస్ పార్టీ ఏ మొహం పెట్టుకుని సభ నిర్వహించిందని ప్రశ్నించారు.