మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం) అమలు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ తీవ్రంగా విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే ఈ చారిత్రాత్మక బిల్లును కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడ్డారు.గత 30 ఏళ్లుగా ఏదో ఒక సాకుతో మహిళా బిల్లును అడ్డుకుంటున్నది కాంగ్రెస్ పార్టీయేనని లక్ష్మణ్ గుర్తుచేశారు.
యూపీఏ హయాంలో సోనియా గాంధీ చైర్ పర్సన్ గా ఉన్నప్పటికీ, కూటమి పార్టీల పేరు చెప్పి వెనక్కి తగ్గారే తప్ప, మహిళా సాధికారతపై, మహిళా రిజర్వేషన్ల అమలుపై వారికి ఎప్పుడూ చిత్తశుద్ధి లేదని ఆయన ధ్వజమెత్తారు.మహిళా రిజర్వేషన్లకు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చట్టంపై కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. 2026 జనాభా లెక్కల తర్వాతే ఈ బిల్లు అమల్లోకి వస్తుందని 2023లో చట్టం చేశారని గుర్తు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఎస్సీ, ఎస్టీ పార్లమెంట్ సీట్ల సంఖ్య 84 నుండి 105 వరకు పెరిగే అవకాశం ఉందని లక్ష్మణ్ వివరించారు.
అదేవిధంగా అసెంబ్లీలో కూడా ఎస్సీ, ఎస్టీలకు సీట్లు పెరుగుతాయి. దళితులు, గిరిజనులకు లభించే ఈ అధిక ప్రాతినిధ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని పేర్కొంటూ వారి ఎదుగుదలను కాంగ్రెస్ సహించలేకపోతోందని విమర్శించారు. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని రేవంత్ రెడ్డి అనవసర భయాందోళనలు సృష్టిస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
ప్రస్తుత సీట్ల నిష్పత్తి తగ్గకుండానే సీట్లను పెంచుతామని ప్రధాని మోదీ ఇప్పటికే భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు 130 పార్లమెంటు సీట్లు ఉంటే దక్షిణాది రాష్ట్రాల వాటా 24 శాతం. అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా లోక్ సభ సీట్లు 816 కు పెరిగితే దక్షిణాది రాష్ట్రాల సంఖ్య 195 అవుతుందని, అదే 24 శాతం నిష్పత్తి కొనసాగుతుందని స్పష్టం చేయసారు.
కాబట్టి మహిళా బిల్లును అడ్డుకోవడానికి నీచ రాజకీయాలు చేయకండని హితవు చెప్పారు. మహిళలు అసెంబ్లీ, పార్లమెంట్ మెట్లు ఎక్కడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదా? అని ప్రశ్నిస్తూ మహిళా శక్తిని తక్కువ అంచనా వేస్తే ప్రజలే మీకు బుద్ధి చెబుతారని డాక్టర్ లక్ష్మణ్ హెచ్చరించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తన పంథాను మార్చుకుని మనస్ఫూర్తిగా మద్దతు ఇవ్వాలని, లేకపోతే మహిళా లోకం ఆగ్రహానికి, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

More Stories
దేశంలో తొలిసారి ఖనిజ అన్వేషణ లైసెన్స్
కేశవ్ కాలేజీ విద్యార్థికి జాతీయ స్థాయిలో ప్రశంసలు
కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు