దేశంలో తొలిసారి ఖనిజ అన్వేషణ లైసెన్స్

దేశంలో తొలిసారి ఖనిజ అన్వేషణ లైసెన్స్

గనుల రంగంలో ఆత్మనిర్భరత దిశగా ముందుకెళ్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వేలంలో గనులశాఖ నుంచి పూర్తి సహకారం అందిస్తున్నామని చెప్పారు. హెచ్ఐసిసిలో నిర్వహించిన బొగ్గు గనుల వేలం రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటూ రికార్డు స్థాయిలో ఏడాదిలో 225 మైనింగ్ బ్లాక్ ల వేలం జరిగిందని, ఏడో విడతలో 19 గనుల వేలం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. 
 
వేలంలో పరిశ్రమలు పూర్తి స్థాయిలో పాలుపంచుకున్నాయని, కేంద్ర ప్రభుత్వం 46 గనుల వేలం నిర్వహిస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో తొలిసారి ఖనిజ అన్వేషణ లైసెన్స్ అందిస్తున్నామని, పర్యావరణహితంగా సరైన విధానాలతో ముందుకెళ్తున్నామని తెలిపారు. పరిశ్రమలు కూడా దేశ హితం, అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని గనులశాఖ అధికారులకు కిషన్ రెడ్డి సూచించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని,  జియో పాలిటిక్స్, వాతావరణ మార్పులు, ఎకనామిక్ సెక్యూరిటీ రంగాల్లో క్రిటికల్ మినరల్స్ కేంద్ర బిందువుగా మారాయని చెబుతూ  ప్రతి దేశం భవిష్యత్తుకు ఇవే ఆధారంగా మారాయని స్పష్టం చేశారు.  2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాలను చేరుకోవడంలో క్రిటికల్ మినరల్స్ అత్యంత కీలక పాత్ర పోషిస్తాయనడంలో అతిశయోక్తి లేదని చెప్పారు.

ఇప్పటివరకు 6 విడతల్లో 46 క్రిటికల్ మినరల్స్ బ్లాకులకు విజయవంతంగా వేలం ప్రక్రియ పూర్తయిందని, ఇప్పుడు 7 వ విడతలో భాగంగా 19 బ్లాక్స్ కు వేలం ప్రక్రియ ప్రారంభించుకున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ లైసెన్స్  మొదటి విడత ప్రారంభించిందని, త్వరలోనే 11 బ్లాకులకు రెండో విడత మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ లైసెన్స్ కూడా ప్రారంభించడానికి చర్యలు చేపట్టామని ఆయనవివరించారు .

విశేషం ఏంటంటే తెలంగాణలో రెండు వెనేడియం, టైటానియం బ్లాకులు వేలానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.  ధనుల్లో గనుల్లో మైనింగ్ పనులు వేగంగా జరగడానికి ప్రభుత్వం చట్టాలను సవరించిందని, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం అనుమతి కోసం వేచి చూడకుండానే వేలం వేసుకునే వెసులుబాటు కల్పించిందని తెలిపారు. పైగా, అటవీ, పర్యావరణ అనుమతుల ప్రక్రియను చాలా సులభతరం చేసిందని తెలిపారు.

24 రకాల ముఖ్యమైన మినరల్స్ పై దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసిందని, త్వరగా ఉత్పత్తిని ప్రారంభించే కంపెనీలకు ప్రోత్సాహకాలు అందజేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. గనులను తవ్వడమే కాకుండా స్క్రాప్ నుంచి మినరల్స్ సేకరించే ‘రీసైక్లింగ్’ పద్ధతులపై పరిశ్రమలు దృష్టి పెట్టాలని ప్రభుత్వం సూచిస్తోందని చెప్పారు.  దీనివల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా ఖర్చు కూడా తగ్గుతుందని చెప్పారు. భారత దేశంలోనే కాకుండా ఆస్ట్రేలియా, అర్జెంటీనా వంటి దేశాల్లో కూడా మినరల్స్ వెలికి తీసేనేదుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.