సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో ప్రమాదం జరిగి ఐదు రోజులు గడుస్తున్నా, శిథిలాల తొలగింపు దాదాపు పూర్తయినా ఇంకా 11 మంది కార్మికులు, సిబ్బంది ఆచూకీ దొరకలేదు. మృతుల సంఖ్యా 39కి చేరుకుంది. నిజానికి ప్రమాద స్థలంలో దొరికిన మృతదేహాల్లో చాలా మందికి సంబంధించి ఏవో కొన్ని చిన్న చిన్న భాగాలే దొరికాయి.
ఒడిశాకు చెందిన మహాపాత్రో అనే కార్మికుడికి సంబంధించి అర చెయ్యితోపాటు మరో రెండు చిన్న భాగాలే లభించాయి. ఈ నేపథ్యంలో ఆచూకీ దొరకని 11 మంది పూర్తిగా కాలిబూడిదయ్యారా? ఇతర మృతదేహాల భాగాల్లో వీరి భాగాలు కలిసిపోయి ఉంటాయా అన్నది తేలడం లేదు. బాధిత కుటుంబాలకు ఏం చెప్పాలనే దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ప్రకటన చేద్దామని భావిస్తున్నట్టు తెలిసింది.
ప్రమాద ప్రాంతంలో శిథిలాల తొలగింపు దాదాపుగా పూర్తయింది. అంతా ఎక్కడికక్కడ జల్లెడలాగా గాలించారు. అయినా గల్లంతైన కార్మికుల పట్ల స్పష్టత రాలేదు. వీరి సంఖ్య ఇంకా పెరగవచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలోని కమిటీ అభిప్రాయపడుతోంది. ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఇప్పటివరకు 31 మందిని అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు ఆస్పత్రి నుంచి 12 మంది డిశ్చార్జ్ కాగా, 23 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.
మరోవైపు సిగాచీ పరిశ్రమలో ప్రమాదం జరిగిన స్థలాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలోని కమిటీ పరిశీలించింది. రెవెన్యూ, పరిశ్రమలు, కార్మిక, అగ్నిమాపక, ఆరోగ్యశాఖ కార్యదర్శులతో కలిసి, సీఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ ఘటనపై ఏర్పాటుచేసిన నిపుణుల కమిటి, గురువారం క్షేత్రస్థాయి పరిశీలన చేయగా, హైలెవల్ కమిటీ అధికారులు పరిస్థితులను ప్రత్యక్షంగా చూశారు. డ్రయర్, రియాక్టర్‌లను పరిశీలించి తాము గుర్తించిన నిర్వహణ, భద్రత లోపాలను గుర్తించారు.
ఆచూకీ తెలియకుండా పోయినవారు ప్రమాద సమయంలో ఏదైనా మూలకు వెళ్లి దాక్కునే ప్రయత్నం చేసి ఉండొచ్చని, వారికి సంబంధించి అవశేషాలు ఏమైనా లభించవచ్చనే ఉద్దేశంతో సహాయక బృందాలు ఫ్యాక్టరీలోని అన్ని విభాగాల్లో అణువణువూ గాలింపు చేపట్టాయి. సందేహంగా ఉన్న బూడిద, ఇతర అవశేషాలను సేకరిస్తున్నాయి. కాగా, సిగాచి పరిశ్రమలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఇస్నాపూర్‌కు చెందిన సిల్వేరు రవి (36) కూడా గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన రోజున ఆయన విధులుకు హాజరైనట్టు రికార్డుల్లో ఉంది. కానీ ఇప్పటివరకు ఆచూకీ దొరకలేదు.నిపుణుల కమిటీ తెలిపిన లోపాలపై వివరణ ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులను హైలెవెల్ కమిటీ కోరింది.
అయితే దీనిపై పూర్తిస్థాయి వివరాలు అందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రమాదస్థలికి సమీపంలోని ఐలా భవనంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ వద్ద బాధితులతో సీఎస్ రామకృష్ణారావుతో పాటు జిల్లా ఉన్నతాధికారులు మాట్లాడారు. హెల్ప్‌డెస్క్ వద్ద తమ వారి ఆచూకీ ఎక్కడని బాధిత కుటుంబసభ్యులు సీఎస్ రామకృష్ణారావుతో మొరపెట్టుకున్నారు.
More Stories
1977లో ఓటమి భయంతో ఆర్ఎస్ఎస్ చెంతకు ఇందిరా గాంధీ!
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!
‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్