
గీతా ఆర్ట్స్ అధినేత, ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌కు చెందిన రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థకు సంబంధించిన రూ.101 కోట్ల బ్యాంక్ రుణ మోసం కేసులో విచారణకు రావాల్సిందిగా అల్లు అరవింద్‌ని ఈడీ ఆదేశించగా విచారణకు హాజరయ్యారు అరవింద్. ఈడీ కార్యాలయానికి హాజరైన అరవింద్‌ను అధికారులు సుమారు మూడు గంటలసేపు ప్రశ్నించారు.
ప్రధానంగా బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల కొనుగోళ్లపై ఆరా తీశారు. విచారణ ఇంకా పూర్తికాకపోవడంతో, వచ్చే వారం మరోసారి హాజరుకావాలని ఈడీ ఆయనకు సూచించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం అల్లు అరవింద్ తెలిపిన వివరాల ప్రకారం 2017లో ఓ ప్రాపర్టీ కొనుగోలులో ఆయన మైనర్ భాగస్వామిగా ఉన్నట్లు తెలిపారు. ఆ ప్రాపర్టీపై వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలోనే ఈడీ ఆయనను విచారించిందని చెప్పారు.
“నిజంగా నేను ఆ ప్రాపర్టీలో చిన్న భాగస్వామిని మాత్రమే. బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో నా పేరు ఉండటంతో విచారణకు పిలిచారు. తప్పు చేశానన్నది కాదు,” అని ఆయన స్పష్టం చేశారు.ఈ కేసుకు కేంద్రబిందువుగా ఉన్నది రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థ. యూనియన్ బ్యాంక్‌కు ఈ సంస్థ రూ.100 కోట్ల అప్పు ఎగ్గొట్టినట్లు ఆరోపణలున్నాయి. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ వాటాలను అల్లు అరవింద్ కొన్నారన్న నేపధ్యంలోనే ఈ కేసులో ఆయన పేరు వెలుగులోకి వచ్చింది.
రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలిట్రానిక్స్ సంస్థలు 2017-19 మధ్య యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.101 కోట్ల రుణం తీసుకుని ఎగవేశాయని ఆరోపణలున్నాయి. 2024లో హైదరాబాద్, కర్నూలు, ఘజియాబాద్‌లోని వివిధ ప్రదేశాలలో సోదాలు చేసిన ఈడీ రూ.1.45 కోట్లను సీజ్ చేసింది. నిందితులు రూ.101.48 కోట్ల రుణ నిధులను మోసపూరితంగా మళ్లించారన్న ఆరోపణలకు సంబంధించి ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.
ఇందులో అకౌంట్ హోల్డర్స్‌గా ఉన్న వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేస్తున్నారు. ప్రధానంగా బ్యాంక్ యాజమాన్యం ఎలాంటి నిబంధనలు పాటించకుండా, ఆర్‌బీఐ నిబంధనలు ఉల్లంఘించి రూ.100 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం చేశారనే అభియోగాలపై ఈడీ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు.
ఈ నిధులను సంస్థ యజమానులు సొంత ప్రయోజనాలకు, అక్రమ నగదు బదిలీకి వాడినట్లు ఈడీ గుర్తించింది. సీబీఐ కేసు నమోదు చేయగా, మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో భాగంగా రామకృష్ణ సంస్థతో అల్లు అరవింద్‌కు చెందిన సంస్థల మధ్య అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఈడీ అధికారులు గుర్తించారు. దీనిపై స్పష్టత కోరుతూ అల్లు అరవింద్ కు నోటీసులు జారీ చేశారు.
More Stories
‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్
హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావుకు రిమాండ్
తెలంగాణలో యూరియా కొరత రావొద్దు