శానిటరీ ప్యాడ్ ప్యాకెట్లపై రాహుల్ గాంధీ ఫొటో

శానిటరీ ప్యాడ్ ప్యాకెట్లపై రాహుల్ గాంధీ ఫొటో
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ గిమ్మిక్కులు మొదలయ్యాయి. ఆ రాష్ట్ర మహిళల్లో రుతుక్రమం పరిశుభ్రతపై అవగాహన పెంచే ఉద్దేశంతో ‘ప్రియదర్శిని ఉడాన్ యోజన’ కింద ఉచిత శానిటరీ ప్యాడ్ ప్యాకెట్ల పంపిణీని కాంగ్రెస్‌ పార్టీ ప్రారంభించింది. బీహార్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మై బహిన్ సమ్మాన్ యోజన’ కింద నెలకు రూ. 2,500 స్టైఫండ్ హామీకి అనుగుణంగా ఈ డ్రైవ్ చేపట్టింది. 
 
ఐదు లక్షలకు పైగా శానిటరీ ప్యాడ్ బాక్స్‌లను మహిళలకు పంపిణీ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది.  కాగా, మహిళలకు ఉచితంగా పంపిణీ చేసే శానిటరీ ప్యాడ్ ప్యాకెట్లపై ప్రియాంక గాంధీతోపాటు రాహుల్‌ గాంధీ ఫొటోలు ఉన్నాయి. దీంతో రాజకీయ దుమారానికి ఇది తెరలేపింది. మహిళల కోసం ఉద్దేశించిన శానిటరీ ప్యాడ్ ప్యాకెట్లపై రాహుల్ గాంధీ చిత్రం ఎందుకని ప్రత్యర్థి పార్టీలు ప్రశ్నించాయి. 
 
కాంగ్రెస్ పార్టీకి ఏమైందని ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు చెందిన జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఇది ఎన్నికల గిమ్మిక్ అని ఆయన అభివర్ణించారు. మరోవైపు ఎన్డీయే కూటమి పార్టీల విమర్శలను కాంగ్రెస్‌ నాయకురాలు అల్కా లాంబా తిప్పికొట్టారు.
 
“రాహుల్ గాంధీ ఫొటో ఈ ప్యాకెట్లపై ఎందుకు ఉన్నాయనేది ప్రశ్న కాదు. ఆధునిక యుగంలోనూ బీహార్‌లోని మన కుమార్తెలు ఇప్పటికీ రుతుక్రమంలో వస్త్రం ముక్కలను ఎందుకు ఉపయోగించాల్సి వస్తున్నది. ఎందుకు అనారోగ్యానికి గురవుతున్నారు అనేది ప్రశ్న. బీజేపీ ఎల్లప్పుడూ మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని కలిగి ఉంది” అని ఆమె విమర్శించారు.