ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఫోన్ చేశారు. వారిద్దరూ సుమారు 40 నిమిషాల పాటు ఫోన్‌లో సంభాషించుకున్నారు. యూఎస్-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఇస్లామాబాద్‌లో పాక్ ఆధ్వర్యంలో జరిగిన మధ్యవర్తిత్వ చర్చలు విఫలం అయిన తర్వాత వీరిద్దరూ ఫోన్‌లో సంభాషించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అందులో ఏమి చర్చించారో కచ్చితంగా తెలియదు. “రాబోయే కొద్ది రోజులు, వారాలలో భారత్, అమెరికాల మధ్య ఇంధనంతో సహా కొన్ని పెద్ద ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది,” అని అమెరికా రాయబారి గోర్ ప్రకటంచడం గమనార్హం. ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం గురించి గోర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇటీవల పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ద్వైపాక్షిక అంశాలపై ఇద్దరు నేతలు ఫోన్‌లో సుదీర్ఘంగా మాట్లాడుకున్నట్లు ఆయన చెప్పారు.
అయితే, ఈ ఏడాదిలో వీరిద్దరి మధ్య జరిగిన చాలా ఫోన్ సంభాషణలు జరిగినట్లు చెప్పారు. అందులో అన్ని ఫోన్‌కాల్ సంభాషణలను బహిరంగపర్చలేదని, కొన్ని మాత్రమే బయటకు చెప్పినట్లు పేర్కొన్నారు. పశ్చిమాసియా సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కీలక పరిణామాలపై సమాచారాన్ని ట్రంప్ ఎప్పటికప్పుడు మోదీతో పంచుకుంటున్నారని ఆయన చెప్పారు.
ట్రంప్ నుండి వచ్చిన ఫోన్ కాల్‌ను ప్రధాని మోదీ ధృవీకరిస్తూ, వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన గణనీయమైన పురోగతిని ఇద్దరు నేతలు సమీక్షించారని, అన్ని రంగాలలో సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నారని చెప్పారు.
“నా మిత్రుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. వివిధ రంగాలలో మన ద్వైపాక్షిక సహకారంలో సాధించిన గణనీయమైన పురోగతిని మేమిద్దరం సమీక్షించుకున్నాం. అన్ని రంగాలలో సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేం కట్టుబడి ఉన్నాము” అని మోదీ ఎక్స్ లో తెలిపారు.
“మేం పశ్చిమాసియా పరిస్థితుల గురించి కూడా చర్చించాం. అలాగే హర్మూజ్ జలసంధిని తెరవడం, భద్రత, దాని ప్రాముఖ్యతను గురించి మాట్లాడుకున్నాం”అని ప్రధాని మోదీ చెప్పారు.
మరోవైపు మోదీ- ట్రంప్ మధ్య సానుకూలమైన, ఫలవంతమైన ఫోన్ సంభాషణ జరిగినట్లు భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక బంధం అత్యంత పటిష్టంగా ఉందని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతోందని ఆయన పేర్కొన్నారు. భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ చర్చలు జరిగాయని తెలిపారు.
ప్రజాస్వామ్య విలువల ఆధారంగా ఏర్పడిన ఈ బంధం రానున్న రోజుల్లో మరింత బలపడుతుందని సెర్గియో గోర్ ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్తాయని సెర్గియో గోర్ పేర్కొన్నారు. చర్చల అనంతరం ట్రంప్ ‘మేమంతా మిమ్మల్ని ఇష్టపడుతున్నాం’ అంటూ ప్రధాని మోదీకి చెప్పిన తర్వాత ఈ సంభాషణ ముగిసిందని సెర్గియో గోర్ తెలిపారు.
ఈ ఏడాదిలో ప్రధానిమ మోదీ- ట్రంప్ మధ్య ఇది మూడోసారి ఫోన్ సంభాషణ కావడం గమనార్హం. ఫిబ్రవరి 2న వాణిజ్య ఒప్పందాల పురోగతిపై, మార్చి 24న పశ్చిమాసియా పరిస్థితులపై ఇద్దరూ చర్చించారు. తాజాగా ఇరాన్- అమెరికా శాంతి చర్చల అనంతరం ఈ సంభాషణ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా, పాకిస్తాన్‌లో అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో, పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తీవ్రమైన పరిస్థితుల మధ్య ఈ ఫోన్ సంభాషణ జరిగింది.

More Stories
కేరళంలో ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ లో పోటా పోటీ!
బెంగాల్ హిందువుల కష్టాలు గట్టెక్కినట్లేనా? అరాచకాలు ఆగిపోయేనా?
రాజకీయ వేధింపులకు పాల్పడుతున్న ఆప్ పంజాబ్ ప్రభుత్వం