లోక్‌సభ స్థానాలు 850కు పెంపు.. కేంద్రం ప్రతిపాదన

లోక్‌సభ స్థానాలు 850కు పెంపు.. కేంద్రం ప్రతిపాదన
ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ స్థానాల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను 850కి పెంచాలని ప్రతిపాదించింది. ఇందులో రాష్ట్రాలకు 815 సీట్లు.. కేంద్రపాలిత ప్రాంతాలకు 35 సీట్లు ఉంటాయి. 131 రాజ్యాంగ సవరణ ద్వారా సీట్లు పెంపునకు ప్రతిపాదనలు చేసింది. 

ఈ మేరకు పార్లమెంట్ సభ్యులకు కేంద్రం సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. 2011 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను కేంద్రం చేపడుతోంది. ఇందుకోసం ఏప్రిల్ 16 నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను అమలుతో పాటు డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.

అయితే, ఈ ప్రక్రియను దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దన్న రేవంత్ ఇందుకు ఆయన హైబ్రిడ్ విధానం ప్రతిపాదించారు. అలాగే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సైతం నియోజకవర్గాల పునర్విభజనతో ప్రశాంతంగా ఉన్న దక్షిణాదిలో తుఫాను రేపొద్దని ఆయన కేంద్రాన్ని హెచ్చరించారు. 

పార్లమెంట్ ఉభయసభల్లో నియోజవర్గాల పునర్విభజన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్రం డీలిమిటేషన్‌ కమిషన్‌ ఏర్పాటుచేసతుంది. అనంతరం సీట్ల పెంపు ప్రక్రియను పూర్తిచేసి 2029 సార్వత్రిక ఎన్నికల్లో అమలు చేయనున్నట్లు సమాచారం. అయితే, దామాషా ప్రకారంఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరిగే అవకాశం ఉంది. జనాభా లెక్కల ఆధారంగా దామాషా ప్రకారం నియోజకవర్గాల పెంపునకు అనుమతిస్తే ఉత్తర, దక్షిణాది మధ్య మరింత అంతరం ఏర్పడుతుందని ముందు నుంచి దక్షిణాది పార్టీలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ సీట్లు సగటున 50% పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, కేంద్రం నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు సంబంధించి అధికారికంగా ప్రకటన చేయడంతో బుధవారం ఇండియా కూటమి పార్టీలు ఢిల్లీలో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నాయి.