
దేశ అవసరాలకు అనుగుణంగా తగినంత బొగ్గు, అల్యూమినియం, రాగి తదితర ఖనిజాలను ఉత్పత్తి చేసి, ఈ రంగాలలో దేశాన్ని స్వయంసమృద్ధి దిశగా నడిపించాల్సిన బాధ్యత పరిశ్రమలపై ఉందని, అదే సమయంలో ప్రకృతికి నష్టం జరగకుండా, ప్రజలకు ఉపయోగపడే విధంగా బాధ్యతాయుత మైనింగ్ ను నిర్వహించాల్సి ఉందని కిషన్ రెడ్డి చెప్పారు. ఈ దిశగా పటిష్టమైన నిబంధనలను రూపొందించుకొని అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
బొగ్గు గనులు ప్రారంభించడంతోపాటు అవి నడుస్తున్నప్పుడు, మూత పడినప్పుడు కూడా ఆ ప్రాంత ప్రకృతికి, ప్రజలకు ఉపయోగపడే విధంగా, యధాతథస్థితిని నెలకొల్పే విధంగా పరిశ్రమలు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. తమిళనాడు రాష్ట్రంలో కొన్ని గనులు ఈ విషయంలో దేశానికి ఆదర్శప్రాయంగా ఉన్నాయని కేంద్ర మంత్రి కొనియాడారు.
మూసివేసిన గనుల ద్వారా స్థానిక ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించారని, ఈ తరహా పద్ధతులను ఇతర పరిశ్రమల వారు కూడా ఆచరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. బొగ్గు గనుల్లో అనుసరిస్తున్న గనుల మూసివేత విధానాలను ఇతర ఖనిజ పరిశ్రమలలో కూడా అవలంబించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
పర్యావరణహిత మైనింగ్ తో పాటు ప్రజల భాగస్వామ్యంతో వారి అభివృద్ధికి తోడ్పడే విధానాలను మైనింగ్ పరిశ్రమ ఆచరించాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి చెప్పారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విచ్చేసిన మైనింగ్ సంస్థల వారు, మైనింగ్ మేధావులు ఈ సదస్సులో తమ సూచనలు, సలహాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. బొగ్గు శాఖ సహాయ మంత్రిసతీష్ చంద్ర దూబే , బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి రూపేంద్ర బ్రార్, కోలిండియా చైర్మన్ పీఎం ప్రసాద్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, బొగ్గు, అల్యూమినియం, రాగి పరిశ్రమల అధికారులు, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సదస్సులో ముందుగా పర్యావరణహిత, ప్రజాహిత మైనింగ్ ప్రక్రియ విషయాలను వివరిస్తూ రూపొందించిన మిషన్ గ్రీన్ బుక్, రిక్లెయిమ్ అనే పుస్తకాలను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. అలాగే అన్వేషణ విభాగం కోసం సింగిల్ విండో విధానం అమలు జరుపుతూ రూపొందించిన పోర్టల్ ను కూడా ఆవిష్కరించారు. అలాగే ఆన్ లైన్ ద్వారా 24వ నైవేలి బుక్ ఫెయిర్ 2025ను కూడా ప్రారంభించారు.
More Stories
1977లో ఓటమి భయంతో ఆర్ఎస్ఎస్ చెంతకు ఇందిరా గాంధీ!
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!
‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్