డోనాల్డ్ ట్రంప్ కలల బిల్లు అయిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. గురువారం అమెరికన్ కాంగ్రెస్‌లో సుదీర్ఘ చర్చ అనంతరం జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 218, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. బిల్లు ఆమోదంతో రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన ట్రంప్‌కు ఘన విజయం దక్కినట్లయింది. ఓటింగ్ సందర్భంగా ఇద్దరు రిపబ్లికన్ సభ్యులు కూడా డెమోక్రాట్లకు అనుకూలంగా ఓటు వేయడం గమనార్హం.
సెనేట్, ప్రతినిధుల సభ ఆమోదంతో బిల్లును అధ్యక్షుడి సంతకం కోసం పంపారు. దీంతో పన్నుల్లో కోతలు, వ్యయ నియంత్రణ లక్ష్యంగా ట్రంప్ తీసుకొచ్చిన ఈ బిల్లు చట్టంగా మారనుంది. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. లక్షలాది కుటుంబాలకు డెత్ ట్యాక్స్ నుంచి విముక్తి కల్పించానని తెలిపారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం ట్రంప్ సాధించిన అతిపెద్ద విజయమని ఆయన మద్దతుదారులు వెల్లడించారు.
4.5ట్రిలియన్ డాలర్ల పన్ను తగ్గింపులు, మెడికెయిడ్, ఫుడ్ స్టాంప్‌లలో 1.2 ట్రిలియన్ డాలర్ల కోతలు, సరిహద్దు భద్రతకు నిధులు సమకూర్చడం, అక్రమ వలసదారులను వెనక్కి పంపే కార్యక్రమానికి నిధులు కేటాయించడం వంటి లక్ష్యాలతో ట్రంప్ సర్కార్ ఈ బిల్లును రూపొందించింది. ఈ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. డెమోక్రాట్లతోపాటూ, కొందరు రిపబ్లికన్లు సైతం ఈ బిల్లును వ్యతిరేకించారు. ఈ బిల్లు కారణంగా టెస్లా బాస్ ఎలాన్ మస్క్, అధ్యక్షుడు ట్రంప్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.
ఈ బిల్లులో మెడికెయిడ్ ఖర్చుల్లో కోతలు, వలస నియంత్రణ, గ్రీన్ ఎనర్జీ పథకాల్లో మార్పులు వంటి అంశాలు కూడా ఉన్నాయి. ఈ బిల్లు ఆమోదానికి ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారు. రిపబ్లికన్ సభ్యులతో ఆయనే మాట్లాడారు. ఈ బిల్లులో సరిహద్దు గోడ నిర్మాణానికి 46 బిలియన్ డాలర్లు, వలసదారుల నిర్బంధ కేంద్రాల విస్తరణకు 45 బిలియన్ డాలర్లు, సిబ్బంది శిక్షణ, నియామకానికి 30 బిలియన్ డాలర్లు కేటాయించారు. ఆశ్రయం కోరే వ్యక్తుల కోసం ముందుగా ప్రతిపాదించిన 1,000 డాలర్ల ఫీజును 100 డాలర్లకు తగ్గించారు. బిల్లులో భాగంగా, ట్రంప్ ప్రభుత్వం బైడెన్ హయాంలో ప్రవేశపెట్టిన గ్రీన్ ఎనర్జీ పథకాలు నిలిపివేసింది.
ఈ బిల్లు ఆమోదం పొందితే తాను కొత్తపార్టీ పెడతానని ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ప్రకటించారు. బిల్లు ఆమోదం పొందిన మరుసటి రోజే ‘అమెరికన్ పార్టీ’ పేరిట కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని హెచ్చరించారు. పన్నుల కోత, ప్రభుత్వ వ్యయానికి సంబంధించి తీసుకొచ్చిన 1000 పేజీల ఈ బిల్లుపై సెనేట్‌లో సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం ఓటింగ్ నిర్వహించగా.. బిల్లుకు అనుకూలంగా 50 ఓట్లు, వ్యతిరేకంగా 50 ఓట్లు వచ్చాయి. చివరికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ టై-బ్రేకర్‌గా మారి బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడంతో సెనేట్‌లో ఈ బిల్లు గట్టెక్కింది.
కాగా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 500 శాతం సుంకాలు విధిస్తామంటూ అమెరికా ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లు పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ఈ బిల్లు రూపొందించిన అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం వద్ద ఈ మేరకు తమ ఆందోళనలు, ఇంధన భద్రత అవసరాలు గురించి వెల్లడించినట్లు చెప్పారు.
More Stories
1977లో ఓటమి భయంతో ఆర్ఎస్ఎస్ చెంతకు ఇందిరా గాంధీ!
ఎల్ఐసీలో 1 శాతం వాటా విక్రయం
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!