నేషనల్ హెరాల్డ్ లో లబ్ధిదారులు సోనియా, రాహుల్!

నేషనల్ హెరాల్డ్ లో లబ్ధిదారులు సోనియా, రాహుల్!
* 2 వేల కోట్ల ఆస్తులపై గాంధీల కన్ను

నేషనల్ హెరాల్డ్ కేసులో జరిగిన నకిలీ లావాదేవీలలో లబ్ధిదారులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాత్రమే అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)  స్పష్టం చేసింది. సోనియా, రాహుల్ గాంధీలకు సంబంధమున్న అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు పలువురు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నకిలీ లావాదేవీలు జరిపారని పేర్కొంటూ బుధవారం న్యూఢిల్లీ కోర్టులో ఈడీ తరఫు న్యాయవాది అదనపు సోలిసిటర్ జనరల్ వి. రాజు తన వాదనలు వినిపించారు. 

అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌)కు చెందిన రూ. 2 వేల కోట్ల విలువైన ఆస్తులను ఆక్రమించడానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నించిందని ఈడీ ఆరోపించింది. సోనియా, రాహుల్‌ ఆదేశాల ప్రకారమే ఇదంతా జరిగినట్టు వెల్లడించింది. ఏజేఎల్‌కు లాభాలు రానప్పటికీ, ఆ సంస్థ పరిధిలో రూ. 2 వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు రాజు గుర్తు చేశారు. అయితే, రోజూవారీ కార్యకలాపాలను నిర్వహించుకోవడం కోసం కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఏజేఎల్‌ ప్రతినిధులు రూ. 90 కోట్ల మేర అప్పు తీసుకొన్నట్టు తెలిపారు.

అయితే ఆ రుణాలను వసూలు చేసుకొనే హక్కును కాంగ్రెస్‌ రూ. 50 లక్షలకే యంగ్‌ ఇండియన్‌ అనే కంపెనీకి బదిలీ చేసినట్టు తెలిపారు. ఈ యంగ్‌ ఇండియన్‌ కంపెనీలోనే సోనియా, రాహుల్‌కు 76 శాతం షేర్లు ఉన్నాయని ఎస్వీ రాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు.  అలా సోనియా, రాహుల్‌ ప్రధాన భాగస్వాములైన యంగ్‌ ఇండియన్‌ కంపెనీ కేవలం రూ. 50 లక్షలు చెల్లించి, రూ. 2,000 కోట్ల విలువైన ఏజేఎల్‌ సంస్థ ఆస్తులపై హక్కు సాధించిందని పేర్కొన్నారు. అలా మొత్తంగా రూ. 90 కోట్ల రుణం ఇచ్చి  దానికి ప్రతిఫలంగా రూ. 2 వేల కోట్ల ఆస్తులను ఆక్రమించడానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. 

ఇందులో భాగంగానే యంగ్‌ ఇండియన్‌ కంపెనీని కుట్రపూరితంగా సృష్టించారని తెలిపారు. తగినన్ని ఆధారాలు లభించిన తర్వాత ఈ కేసులో కాంగ్రెస్‌ పార్టీని కూడా నిందితుల జాబితాలో చేరుస్తామని కోర్టుకు తెలిపారు. ఏజేఎల్‌కు ఇచ్చిన రుణాల విషయంలోనూ అవకతవకలు జరిగినట్టు ఈడీ ఆరోపించింది. విరాళాల పేరిట ప్రజల నుంచి సేకరించిన సొమ్మును వాణిజ్య అవసరాలకు ఉద్దేశించిన కంపెనీలో కాంగ్రెస్‌ పార్టీ పెట్టినట్టు విచారణ సందర్భంగా ఈడీ తెలిపింది. 

ఈ క్రమంలో అద్దె, ఇతరత్రాల రూపంలో రూ. 142 కోట్లను సోనియా, రాహుల్‌ అయాచితంగా లబ్ధి పొందారని మరోసారి గుర్తు చేసింది. కాంగ్రెస్‌ అగ్రనేతల సూచనల ప్రకా రం.. ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులు ఏజేఎల్‌తో నకిలీ ఆర్థిక లావాదేవీలను కూడా జరిపినట్టు పేర్కొంది. ఈ కేసులో రాహుల్‌, సోనియాతో పాటు శామ్‌పిట్రోడా, సుమన్‌ దూబే తదితరులు కూడా మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు తెలిపింది. 

ఈడీ దాఖలు చేసిన అభియోగాలను పరిగణనలోకి తీసుకొన్న ధర్మాసనం జూలై 8 వరకూ ప్రతీరోజూ ఈ కేసును విచారిస్తామని వెల్లడించింది. సుమన్ దుబే షేర్లను సోనియా గాంధీకి, ఆస్కార్ ఫెర్నాండేజ్ షేర్లను రాహుల్ గాంధీకి బదిలీ చేశారని, కానీ ఆ తర్వాత ఈ షేర్లను ఆస్కార్ ఫెర్నాండెజ్‌కు తిరిగి బదిలీ చేశారని సోదాహరణగా కోర్టుకు ఆయన వివరించారు. 

ఇవన్నీ నకిలీ లావాదేవీలని న్యాయవాది వి రాజు ఈ సందర్బంగా పేర్కొన్నారు. 2015 వరకు ఆ ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఈ సంస్థ ద్వారా లబ్ధి పొందారని స్పష్టం చేశారు. స్వాతంత్య్రానికి పూర్వం కాంగ్రెస్ పార్టీ తన భావాలను ప్రతిబింబించే విధంగా ఒక పత్రికను ప్రారంభించాలని భావించింది. ఈ ఉద్దేశ్యంతో 1938లో ది నేషనల్ హెరాల్డ్ పత్రికను జవహర్ లాల్ నెహ్రు ప్రారంభించారు. 

దీనికి అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ ప్రచురణకర్తగా వ్యవహరించింది. దీంతో స్వాతంత్య్రానికి పూర్వం ఈ పత్రిక కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైందిగా మారింది. ఈ పత్రిక ఆంగ్లంలోనే కాకుండా  హిందీ, ఉర్దూ భాషల్లో సైతం వెలువడేది. అయితే 2008లో రూ. 90 కోట్ల మేర అప్పుల కారణంగా ఈ పత్రిక మూతపడింది. అంతేకాకుండా, ఈ పత్రిక ఆస్తులపై వివాదాలు నెలకొన్నాయి. 

ఈ నేపథ్యంలో 2012లో బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యన్ స్వామి ట్రయల్ కోర్టులో ఈ పత్రికపై ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోపాటు ఇతరులు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ను స్వాధీనం చేసుకున్నారని, తద్వారా దీని నుంచి రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా వారు పొందారని ఆరోపించారు.