
ఆధునిక చైనాకు పునాదులు వేసిన మావో జెడాంగ్ తర్వాత, అంతటి శక్తివంతమైన నేతగా గుర్తింపు పొందిన షి జిన్‌పింగ్ శకం త్వరలో ముగియనుందా? జిన్‌పింగ్ స్థానంలో మరో నేతను ఎన్నుకునేందుకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ సన్నాహాలు మొదలు పెట్టిందా? మే 21 నుంచి జూన్ 5 వరకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కనిపించకుండా పోవడానికి కారణమేమిటి?
బ్రెజిల్‌లోని అతిపెద్ద నగరమైన రియో డి జనీరోలో జులై 5 నుంచి 8 వరకూ 17వ బ్రిక్స్ సదస్సు జరగనుంది. బ్రిక్స్ సభ్యదేశాలైన భారత్, బ్రెజిల్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా అధినేతలు ఈ సమావేశానికి హాజరుకావాల్సి ఉంది. ఈ సదస్సుకు భారత ప్రధాని మోదీ హాజరుకానున్నారు. కాగా చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ హాజరుకావడంలేదని ఆ దేశ విదేశాంగశాఖ ప్రకటించింది.
జిన్‌పింగ్ బదులు చైనా ప్రధాని లీ చియాంగ్ సదస్సుకు హాజరుకానున్నట్లు వెల్లడించింది. 12 ఏళ్లలో బ్రిక్స్ సదస్సుకు జిన్‌పింగ్ దూరంగా ఉండడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఎందుకు జిన్‌పింగ్ బ్రెజిల్ వెళ్లడంలేదని విలేకరులు అడగ్గా సమాధానం చెప్పేందుకు చైనా విదేశాంగశాఖ ప్రతినిధి నిరాకరించారు.
మే 21 నుంచి జూన్ 5 వరకూ కనిపించకుండా పోయిన చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్, తాజాగా బ్రిక్స్ సదస్సుకు కూడా దూరంకావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా చైనా అధ్యక్షుడు కనిపించకుండా పోవడం నాయకత్వ మార్పునకు సంకేతమని కొన్ని నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి. గతంలో కూడా అధ్యక్షులు మారినప్పుడు అంతకుముందు ఉన్నవారు కొన్ని రోజులుగా కనిపించలేదని నిఘా సంస్థలు చెబుతున్నాయి.
జిన్పింగ్ అదృశ్యమయ్యారన్న వార్త చైనాలో కలకలం రేపింది. సంస్కరణాభిలాషి, టెక్నోక్రాట్ అయిన వాంగ్ యాంగ్ తదుపరి అధ్యక్షుడు కావొచ్చంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే జిన్‌పింగ్ ఇలా అదృశ్యం కావడం సాధారణమేనని కొన్ని నిఘా సంస్థలు స్పష్టం చేశాయి. అదే సమయంలో అధినేతలను చైనా కమ్యూనిస్టు పార్టీ పక్కనబెట్టడం రివాజేనని అభిప్రాయపడ్డాయి.
అంతేకాదు, కొన్ని రోజులుగా జిన్‌పింగ్ చైనాలో బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. దాదాపు ప్రతి రోజూ మొదటిపేజీలో జిన్‌పింగ్ ఫొటోలతో వార్తలు ప్రచురించే ప్రభుత్వ పత్రిక పీపుల్స్ డైలీలో ఈ మధ్య ఆయన వార్తలుగానీ, ఫొటోలుగానీ కనిపించటం లేదు. చైనాకు వస్తున్న విదేశాల అధినేతలకు, ప్రతినిధులకు చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ)కి చెందిన సీనియర్ నేతలు ఆతిథ్యం ఇస్తున్నారే తప్ప జిన్‌పింగ్ జాడ లేదు.
జూన్ తొలివారంలో చైనాకు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో వచ్చినప్పుడు ఆయనతో జిన్‌పింగ్ సమావేశయ్యారు కానీ, ఈ తరహా ద్వైపాక్షిక సమావేశాల సందర్భంగా కనిపించే ఆర్భాటం మచ్చుకైనా లేదు. ఈ సమావేశంపై బెలారస్ అధ్యక్ష ప్రెస్ సర్వీస్ ఒక ప్రకటన విడుదల చేస్తూ సదరు భేటీలో జిన్‌పింగ్ అలసటతో ఉన్నట్లుగా కనిపించారని తెలిపింది.
ఇటీవల జిన్‌పింగ్ వ్యక్తిగత భద్రత సిబ్బందిని సగానికి తగ్గించారు. ఆయన తండ్రి స్మారకస్థలానికి ఇప్పటి వరకూ ఉన్న అధికారిక హోదాను తొలగించారు. అంతేకాదు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జిన్‌పింగ్ ఫోన్‌లో సంభాషించారన్న వార్తను చైనా ప్రభుత్వ టీవీ ఇటీవల ప్రసారం చేస్తూ జిన్‌పింగ్ పేరు ముందు ఎటువంటి హోదా ను పేర్కొనకపోవటం విశేషం. ఇవన్నీ చూసి, చైనా లో ఏదో జరుగుతోందని విశ్లేషకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. జిన్‌పింగ్‌ను పేరుకే అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నప్పటికీ.. అధికారాలు ఆయన చేతుల్లో లేకపోవచ్చని చెబుతున్నారు.
More Stories
1977లో ఓటమి భయంతో ఆర్ఎస్ఎస్ చెంతకు ఇందిరా గాంధీ!
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!
‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్