
కోర్టు ధిక్కరణ కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆరునెలల జైలు శిక్ష పడింది. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ఐసిటి) ఆరునెలల శిక్ష విధించినట్లు స్థానిక మీడియా బుధవారం వెల్లడించింది. జస్టిస్ మహమ్మద్ గోలమ్ మోర్తుజా మొజుందార్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. హసీనా ఫోన్ సంభాషణ లీకైన ఘటన తీవ్ర దుమారాన్ని లేపింది. సోషల్ మీడియాలో ఆ ఫోన్ సంభాషణ లీక్ కావడంతో.. ప్రధాన మీడియా సంస్థలు కూడా ఆ కథనాన్ని ప్రచురించాయి.
నిషేధిత బంగ్లాదేశ్ ఛత్ర లీగ్ (బిసిఎల్) నేత, గోబిందగంజ్ జిల్లా చైర్మెన్ షాకిల్ అకండ బుల్‌బుల్‌తో ఫోన్‌లో మాట్లాడిన హసీనా తనపై 227 కేసులు నమోద్యాయని, దీంతో తనకు 227 మందిని చంపడానికి లైసెన్స్ లభించిందని హసీనా ఆరోపించినట్లు లీకైన ఆడియో క్లిప్‌లో ఉంది. ఈ ప్రకటన కోర్టు ధిక్కరణ ప్రత్యక్ష ప్రయత్నంగా పరిగణించినట్లు ట్రిబ్యునల్ పేర్కొంది.
షకీల్ అక్రాంత్ బుల్బుల్‌ను కూడా దోషిగా నిర్థారించిన ఐసిటి రెండు నెలల జైలు శిక్ష విధించినట్లు మీడియా పేర్కొంది. వారి అరెస్ట్ లేదా వారు లొంగిపోయిన నాటి నుండి శిక్షలు అమల్లోకి వస్తాయని ట్రిబ్యునల్ తెలిపింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తం కావడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసి, దేశాన్ని వీడిన హసీనా, ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రధాని పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి. అయితే ఒక కేసులో శిక్ష పడటం ఇదే మొదటిసారి.
హసీనాతోపాటు అప్పటి అవామీలీగ్ నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై నేరారోపణలు నమోదయ్యాయి. ఇప్పటికే ఐసిటి ఆమెకు అరెస్టు వారెంట్ జారీ చేయగా, తాజాగా కోర్టు ధిక్కరణ కేసులో ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలోనే ఆమెను బంగ్లాదేశ్‌కు రప్పించేందుకు యూనస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
More Stories
హసీనాను స్వదేశానికి రప్పించేందుకు విశ్వప్రయత్నాలు
వంద ఏళ్లైనా ఏఐతో ప్రోగ్రామర్లను భర్తీ చేయలేరు
భారత్ ను మినహాయించి 22 దేశాలపై ట్రంప్ సుంకాలను