అమెరికాలో భారత సంతతి మహిళ దారుణ హత్య

అమెరికాలో భారత సంతతి మహిళ దారుణ హత్య
అమెరికాలో భారత సంతతి మహిళ దారుణ హత్యకు గురయ్యారు. వర్జీనియాలోని ఓ సూపర్‌మార్కెట్‌ లో పనిచేస్తున్న గుజరాతీ మహిళపై దుండగుడు కాల్పులు జరిపి హతమార్చాడు. దోపిడీ యత్నంలో ఈ ఘాతుకం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మృతురాలి కుటుంబసభ్యులు ధృవీకరించారు. 
 
మృతురాలిని మేఘనాబెన్ పటేల్ గా గుర్తించారు. ఆమె గుజరాత్‌లోని మెహసానా జిల్లా, విసాపూర్ తాలూకాలోని జంత్రాల్ గ్రామానికి చెందినవారు.
గడిచిన పదేళ్లుగా మేఘన వర్జీనియాలోని సూపర్‌మార్కెట్‌లో పనిచేస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు కర్సన్‌భాయ్ పటేల్, కపిలాబెన్ ప్రస్తుతం జంత్రాల్ గ్రామంలోనే నివసిస్తున్నారు. 
 
కాగా మేఘన హత్య ఘటన స్టోర్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. వీడియోలోని దృశ్యాల ఆధారంగా జంతువుల చర్మం ప్రింట్ ఉన్న ప్యాంటు, గ్రే జాకెట్ ధరించిన ఓ వ్యక్తి ముఖానికి ముసుగుతో స్టోర్‌లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో స్టోర్‌లో జనం ఎవరూ లేరు.  అతను నేరుగా కౌంటర్ వద్దకు వచ్చి మేఘనాబెన్‌తో మాటలు కలిపాడు. 
 
కొద్దిసేప‌టి త‌ర్వాత‌ అనూహ్యంగా జేబులోంచి తుపాకీ తీసి ఆమెపై కాల్పులు జరిపాడు. దాంతో ఆమె కిందపడిపోగానే నిందితుడు కౌంటర్ పైనుంచి లోపలికి దూకి ఆమెపైకి వంగి మరిన్ని రౌండ్లు కాల్పులు జరిపాడు. అనంతరం నిందితుడు వచ్చిన దారిలోనే పరారయ్యాడు.  దుండగుడు ఆమెపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
 
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ కాల్పులు దోపిడీ ఉద్దేశంతోనే జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.  మేఘనాబెన్‌కు భర్త ఉపేంద్రభాయ్ పటేల్, కుమార్తె నక్షీబెన్, కుమారుడు స్మిత్ ఉన్నారు. ఈ ఘటనతో అమెరికాలోని భారతీయ సమాజంలో విషాదం నెలకొంది.