పాక్ లో మరోసారి ఉగ్రదాడిలో ఐదుగురి మృతి

పాక్ లో మరోసారి ఉగ్రదాడిలో ఐదుగురి మృతి
పాకిస్థాన్ మరోసారి ఉగ్రదాడితో ఉలిక్కిపడింది. వాయవ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో బుధవారం జరిగిన బాంబు పేలుడు అందరిని షాక్‌కు గురి చేసింది. ఈ ఘటనలో ఓ ప్రభుత్వ అధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. బజౌర్ జిల్లాలో జరిగిన ఈ దాడికి ఉగ్రవాదులు రిమోట్ కంట్రోల్ బాంబును ఉపయోగించారు. 
 
ప్రభుత్వ పనుల్లో ఉన్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ పేలుడులో అసిస్టెంట్ కమిషనర్ ఫైసల్ సుల్తాన్‌ మృతిచెందారు. ఆయనతోపాటు మరో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పేలుడు జరిగిన వెంటనే భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరాయి. సహాయక బృందాలు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మరణాలు మరింత పెరిగే అవకాశం ఉందని జిల్లా పోలీసు చీఫ్ వకాస్ రఫిక్ తెలిపారు.
 
ఇప్పటివరకు ఈ దాడికి ఎవరూ బాధ్యత వహించలేదు. కానీ అధికారులు పాక్ తాలిబన్ (టీటీపీ) హస్తాన్ని ఊహిస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత పాక్‌లో టీటీపీ ఉనికి మళ్లీ పెరిగింది.  ఇది ఒక్కటే కాదు. శనివారం ఉత్తర వజిరిస్థాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 16 మంది సైనికులు చనిపోయారు. ఆ దాడికి టీటీపీకి చెందిన హఫీజ్ గుల్ బహదూర్ వర్గం బాధ్యత వహించింది. ఈ ఘటనలతో సరిహద్దు భద్రతపై ప్రజల్లో భయం పెరిగింది.ఇప్పటివరకు 2025లో జరిగిన ఉగ్రదాడుల్లో 290 మందికి పైగా చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది సైనికులే కావడం గమనార్హం. ప్రభుత్వం భద్రతా పరంగా ఏం చర్యలు తీసుకుంటుందో అనేది కీలకం.