
ఎన్నో ఏళ్లుగా పరారీలో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను యాంటీ టెర్రిరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ అధికారులు అన్నమయ్య జిల్లా రాయచోటిలో అరెస్ట్ చేసారు. అన్నమయ్య జిల్లా పరిధిలో పక్కా సమాచారంతో మాటువేసిన తమిళనాడుకు చెందిన ఏటీఎస్ సిబ్బంది ఉగ్రవాదులైన అబూబక్కర్ సిద్దీక్క్ (నాగూర్), మొహమ్మద్ అలీ అలియాస్ యూనుస్ (మేళపాలయం) అనే ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు.
30 ఏళ్లుగా రాయచోటిలో మారుపేర్లతో వీరు చీరల వ్యాపారం చేస్తున్నట్లు ఐబీ గుర్తించింది. మంగళవారం రాయచోటి వచ్చిన చెన్నై ఐబీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సిద్ధిఖీ, మహమ్మద్ అలీ ఇళ్లలో తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన పుస్తకాలు, కొంత సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
వారిని తమిళనాడులోని స్పెషల్ కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరు పరిచినట్టు తెలుస్తోంది. పట్టుబడిన ఇద్దరిలో 30 ఏళ్ల నుంచి పరారీలో ఉన్న సిద్దీక్ 1995లో చెన్నై చింతాద్రిపేటలో హిందూ మున్నాని కార్యాలయంలో బాంబు పేలుడు, నాగూరులో పార్శిల్ బాంబు పేలుడు, 1999లో చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరు, కేరళలో 7 చోట్ల బాంబులు పెట్టడం, 2011లో మధురైలో ఎల్.కె.అద్వానీ రథయాత్ర సమయంలో పైప్ బాంబు కేసులలో నిందితుడు.
అదేవిధంగా 2012లో వెల్లూరులో డాక్టర్ అరవింద్ రెడ్డి హత్య, 2013లో బెంగళూరు మల్లేశ్వరంలో బీజేపీ కార్యాలయం సమీపంలో బాంబు పేలుడు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. ఇక పాతికేళ్లకు పైగా పరారీ లో ఉన్న మొహమ్మద్ అలీ 1999లో తమిళనాడు, కేరళలో బాంబు ఉంచే ఘటనల్లో నిందితుడుగా ఉన్నాడు. వీరిద్దరి అరెస్ట్ నేపథ్యంలో రాయచోటి పోలీసులు అప్రమత్తమయ్యారు. బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ ఇరువురి ఉగ్రవాదులు 200మందికి పైగా ఉగ్రమూకలను తయారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసు బృందాలు చాలా లోతుగా విచారణ చేస్తున్నాయి.
More Stories
టిటిడిలో వేయి మందికి పైగా అన్యమతస్థులు
అధిక పొగ వాహనాలకు తిరుమలలో ప్రవేశం లేదు
అన్యమత ప్రార్థనల్లో టీటీడీ ఏఈఓ సస్పెండ్