
ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్. రామచందర్ రావులు నియమితులైన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు ఈ ఇద్దరు నేతలకు అభినందనలు తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్ట్‌లు చేశారు.
రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కూటమి ఆత్మతో పనిచేద్దామని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మాధవ్, రామచందర్ ఇద్దరూ శాసన మండలిలో అనుభవం కలిగినవారని, ప్రజా సమస్యలపై గళం విప్పినవారని కొనియాడారు. పీవీఎన్ మాధవ్ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉన్నారని, నిరుద్యోగ సమస్యలపై చట్టసభల్లో చురుకుగా స్పందించారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.
అలాగే రామచందర్ రావు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థి నాయకుడిగా ఎదిగి, ఎమ్మెల్సీగా శాసన మండలిలో ప్రజల సమస్యలు గళంగా వినిపించారని పేర్కొన్నారు. ఇద్దరూ జాతీయ దృక్పథం కలిగిన నాయకులుగా బీజేపీ అభివృద్ధికి దోహదపడతారని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో రామచందర్ కీలక పాత్ర పోషిస్తారని పవన్ అభిప్రాయపడ్డారు.తాజా నియామకాల నేపథ్యంలో బీజేపీ, టిడిపి, జనసేనల మధ్య ఏర్పడిన కూటమి మరింత బలపడుతుందని నేతలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాధవ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, “మూడు పార్టీల సమన్వయం, పరస్పర సహకారంతో రాష్ట్రాభివృద్ధికి పాటుపడదాం” అని ట్వీట్ చేశారు. మాధవ్ నాయకత్వం కూటమి స్పూర్తిని ముందుకు తీసుకువెళ్తుందని పవన్ కళ్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నూతన నాయకత్వంతో కూటమి మరింత మేల్కొని, ప్రజల సమస్యలపై సమర్థంగా పోరాడుతుందన్న నమ్మకంతో తెలుగు రాజకీయ వర్గాలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
More Stories
టిటిడిలో వేయి మందికి పైగా అన్యమతస్థులు
అధిక పొగ వాహనాలకు తిరుమలలో ప్రవేశం లేదు
అన్యమత ప్రార్థనల్లో టీటీడీ ఏఈఓ సస్పెండ్