ఏపీలో బిజెపిని తిరుగులేని శక్తిగా చేసేందుకు కృషి

ఏపీలో బిజెపిని తిరుగులేని శక్తిగా చేసేందుకు కృషి
ఏపీలో బీజేపీని తిరుగులేని శక్తిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఏపీ బీజేపీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ఎమ్యెల్సీ పీవీఎన్ మాధవ్ తెలిపారు.  ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి నుండి విజయవాడలోని పార్టీ కార్యాలయంలో స్వీకరిస్తూ  తమ కుటుంబం, బీజేపీ వేర్వురు కాదని స్పష్టం చేశారు. 
 
పురంధేశ్వరి సారథ్యంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, మూడు ఎంపీలు సాధించాని గుర్తుచేశారు. గత రెండేళ్లుగా పురందేశ్వరి నేతృత్వంలో పార్టీ బలోపేతం అయ్యిందని చెబుతూ కూటమి ఈ సంఖ్యను రెట్టింపు చేసేలా ఏపీలో బీజేపీ క్రియాశీలకంగా పనిచేస్తోందని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలకు భరోసా కల్పించారని చెప్పుకొచ్చారు. 
 
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు పురందేశ్వరి మరిన్ని సేవలు అందించనున్నారని చెప్పారు. సోము వీర్రాజు బీజేపీ బలోపేతం కోసం ఇల్లు కూడా మరచిపోయి ఏపీ మొత్తం తిరుగుతూ పని చేశారని గుర్తుచేశారు. ఎంతోమంది పెద్దలు బీజేపీలో ఉన్నారని, వారి సహకారంతో పార్టీని ముందుకు తీసుకెళ్తానని మాధవ్ తెలిపారు.
 
“ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కీలకమైన బాధ్యత. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఏర్పడి వందేళ్లు అయిన సందర్భంలో నాకు అధ్యక్ష పదవి రావడం ఆనందంగా ఉంది. ఏపీలో బీజేపీ శక్తివంతంగా ఉందని కేంద్ర పెద్దలు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో వనరులు ఉన్నాయి. వాటిని పూర్తిగా వినియోగించుకుని ప్రజలకు ఉపయోపడేలా చూడాలి. ప్రధాని నరేంద్రమోదీ ఏపీకి అందిస్తున్న సహకారం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి” అని తెలిపారు. 
 
“తప్పకుండా నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. ఎంతోమంది పెద్దలు అధ్యక్షులుగా బీజేపీ బలోపేతం కోసం‌ పని చేశారు. వారి స్పూర్తితో నేను బీజేపీని ఏపీలో అధికారంలోకి తెచ్చే దిశగా పని చేస్తాను” అని పీవీఎన్ మాధవ్ హామీ ఇచ్చారు.బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నికల నిర్వాహకుడిగా బెంగుళూరు ఎంపీ, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు పీసీ మోహన్ వ్యవహారించారు.

ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్న నేపథ్యంలో ఆచితూచి అడుగు వేయాలని సూచించారు. ఒకటికి పది సార్లు ఆలోచనలు చేసి మాట్లాడాలని పేర్కొంటూమాధవ్ ఈ అంశాలని పరిగణలోకి తీసుకుని అడుగులు వేయాలని తెలిపారు. ఇప్పటి వరకు సహకారం అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు 

 
మనం ఐదు శాతం సీట్లు తీసుకోవడం కాదని, మనమే మరో‌ పార్టీకి సీట్లు ఇచ్చే స్థాయికి ఎదగాలని కేంద్ర సహాయమంత్రి శ్రీనివాస వర్మ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేసేలా‌ పీవీఎన్ మాధవ్ చూడాలని కోరారు. కింది స్థాయి కార్యకర్తలతో మాట్లాడి..‌ వారి సమస్యలు పరిష్కరించేలా మాధవ్ పని చేయాలని కేంద్ర మంత్రి   సూచించారు.
 
మాధవ్ నేతృత్వంలో ఏపీలో బీజేపీ తప్పకుండా బలోపేతం అవుతుందని పేర్కొంటూ బీజేపీ అధ్యక్షుడిగా పూర్తి స్థాయి సామర్థ్యం ఉన్న నేత మాధవ్ అని ఎమ్మెల్సీ, బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు కొనియాడారు. ఏపీ బీజేపీనే సొంతం ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఎదగాలని ఎంపీ సీఎం రమేశ్ ఆకాక్షించారు. పీవీఎన్ మాధవ్‌ కార్యకర్త నుంచి నాయకుల వరకు అందరికీ అందుబాటులో ఉంటారని, పార్టీని బలోపేతం చేసేలా కృషి చేస్తారని వెల్లడించారు.