
* పాక్ కు పారిపోయిన ఇద్దరు ఉగ్రవాదుల ఆస్తుల జప్తు
పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపి 26 మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని ఆదివారం ఉదయం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు అరెస్ట్ చేశారు. పహల్గాం ఉగ్రదాడి కేసును టేకప్ చేసిన ఎన్‌ఐఏ ఇప్పటివరకు 2000 మందికి పైగా సాక్షులను విచారించింది. వారిలో పహల్గాంలో గుర్రాలపై పర్యాటకులను రవాణా చేసేవారు కూడా ఉన్నారు.
వేల మంది సాక్షులను విచారించిన ఎన్‌ఐఏ అధికారులు గత రెండు వారాలుగా జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. మొత్తం 32 ప్రాంతాల్లో సోదాలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్ చేశారు. ఉగ్రదాడి ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కీలక పురోగతి సాధించింది. ఈ ఘాతుకానికి పాల్పడింది పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులని ఎన్‌ఐఏ నిర్ధారించింది.
వీరికి సహకరించిన ఇద్దరు స్థానికులు పర్వేజ్ అహ్మద్ జోతార్ (బట్‌కోట్, పహల్గామ్ నివాసి), బషీర్ అహ్మద్ జోతార్ (హిల్ పార్క్, పహల్గామ్ నివాసి) లను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. దాడికి ముందు పర్వేజ్, బషీర్ ఉద్దేశపూర్వకంగానే హిల్ పార్క్‌లోని ఒక సీజనల్ గుడిసెలో (ధోక్) ఈ ముగ్గురు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారని పేర్కొన్నారు. వీరు ఉగ్రవాదులకు ఆహారం, వసతితో పాటు ఇతర లాజిస్టికల్ సహకారం కూడా అందించారని తెలిపారు.
అరెస్టు చేసిన ఇద్దరు నిందితులపై చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ)లోని సెక్షన్ 19 (ఉగ్రవాదికి ఆశ్రయం కల్పించినందుకు శిక్ష) కింద కేసు నమోదు చేసినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 22న నలుగురు ఉగ్రవాదులు పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపారు. మహిళలను, చిన్నారులను విడిచి పురుష పర్యాటకులను కాల్చిచంపారు.
ఒక్కొక్కరిని పేర్లు అడుగుతూ మారణహోమం సృస్టించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మరణించారు. వారిలో 25 మంది భారతీయులు కాగా, ఒక నేపాలీ ఉన్నారు. కాగా, పాకిస్థాన్ పారిపోయి అక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్‌తోపాటు పాక్ సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తున్న ఇద్దరు వ్యక్తుల స్థిరాస్తులను కోర్టు ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర పోలీసులు జప్తు చేశారు. 2003లో హంద్వారాలో మహమ్మద్ షఫీ బారా, జీ హెచ్ ముస్తాఫాలు ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారు. హంద్వారా, మూన్‌బాల్ వాసులైన వీరిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
More Stories
భారత్‌కు నష్టం కలిగించారనే ఒక్క ఫొటో చూపించగలరా?
1977లో ఓటమి భయంతో ఆర్ఎస్ఎస్ చెంతకు ఇందిరా గాంధీ!
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!