ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకుపడుతున్న ఇరాన్‌

ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకుపడుతున్న ఇరాన్‌

* అమెరికాపై భద్రతా మండలికి ఇరాక్ ఫిర్యాదు

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య పోరు ఉధృతంగా సాగుతుండగా ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా  రంగంలోకి దిగడం ఈ ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసింది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలే లక్ష్యంగా ఇరాన్‌ క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇరాన్‌లోని అణుకేంద్రాలపై అమెరికా ప్రత్యక్ష దాడులు చేసిన కొన్ని గంటలకే టెహ్రాన్‌ ఈ విధంగా స్పందించింది. 
ఇరాన్‌ దాడులను ఇజ్రాయెల్‌ సైనిక దళాలు కూడా ధ్రువీకరించాయి. ఇరాన్ క్షిపణులు తమ దేశంపైకి దూసుకొస్తున్నాయని పేర్కొ్న్నాయి.
ఆ క్షిపణులను అడ్డుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించాయి. ఇరాన్‌ దాడులతో ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌, జెరూసలెంతోపాటు పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు వినిపించాయి.  ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ తన ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. క్షిపణులు దూసుకొస్తున్నందున పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించింది. స్థానిక అధికారుల సూచనలను పాటించాలని, తదుపరి ఆదేశం వరకు అక్కడే ఉండాలని పేర్కొంది.

ఈ దాడులను అమెరికా అధ్యక్షుడు ప్రారంభించారని, తాము అంతం చేస్తామని ఇరాన్‌ హెచ్చరించింది. ఇరాన్‌ గగనతల నిబంధనలను ఉల్లంఘించి అమెరికా అతిపెద్ద నేరం చేసిందని, ఇకపై అక్కడి వారికి పశ్చిమాసియాలో స్థానం లేదని తెలిపింది. పశ్చిమాసియాలో ఉన్న యూఎస్‌ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంటూ వాటికి సంబంధించిన గ్రాఫిక్స్‌ను మీడియా ఛానెల్‌ ప్రసారం చేసింది.

ఇరాన్‌ తాజాగా హెచ్చరిక చేయడంతో ఇరాన్‌ ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉందనే అనుమానం ఉన్న పలు ప్రాంతాల్లో అమెరికా పాలకులు హైఅలర్ట్‌  ప్రకటించారు. అందులో భాగంగా ప్రార్థనా స్థలాలు, సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను పటిష్ఠం చేసింది.  వాషింగ్టన్‌ సహా పలు నగరాల్లో హైఅలర్ట్‌ ప్రకటించింది. ఇరాన్‌లో దాడుల నేపథ్యంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు న్యూయార్క్ పోలీస్ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇరాన్‌పై అమెరికా దాడి చేయడంపై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా దాడులు అంతర్జాతీయ శాంతి, భద్రతలకు ముప్పని ఐరాస చీఫ్‌ ఆంటోనియో గుటెరస్ స్పష్టం చేశారు. ఉద్రిక్తతల తగ్గింపునకు ఐరాస సభ్యదేశాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.  ఐరాస చార్టర్‌ నియమాలను అన్ని సభ్యదేశాలు పాటించాలని అమెరికాను ఉద్దేశించి హితవుపలికారు. 
 
ఉద్రిక్తతల నివారణకు సైన్యం కన్నా దౌత్యమే మంచి మార్గమని ఆంటోనియో గుటెరస్ సూచించారు. అమెరికా దాడుల్ని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ ఐఎఇఏ  ఖండించింది. అణు స్థావరాలపై దాడులు ఎప్పటికీ జరగకూడదని, ఇవి అణు భద్రతకు తీవ్ర పరిణామాలను కలిగిస్తాయని పేర్కొంది. ఇరాన్‌లోని అణు స్థావరాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, రేడియేషన్ స్థాయిలలో ఎటువంటి పెరుగుదల లేదని నిర్ధారించింది.

ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్​

కాగా, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితుల గురించి వివరంగా చర్చించామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు మోదీ వివరించారు. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి, దౌత్య చర్చలు జరపాలని సూచించినట్లు మోదీ పోస్టు చేశారు.

అమెరికా దాడులను బ్రిటన్‌ సమర్థించింది. ఇరాన్ అణు కార్యక్రమం అంతర్జాతీయ భద్రతకు తీవ్ర ముప్పని, ఇరాన్‌ దగ్గర అణ్వస్త్రం ఎప్పటికీ ఉండకూడదని బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ తెలిపారు. ఆ ముప్పును తగ్గించడానికి అమెరికా చర్యలు తీసుకుందన్నారు. ప్రస్తుత సంక్షోభాన్ని అంతం చేయడానికి చర్చలకు తిరిగి రావాలని ఇరాన్‌ను కోరుతున్నట్లు తెలిపారు.

మరోవైపు అణుకేంద్రాలపై అమెరికా దాడులను లాటిన్‌ అమెరికా దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడులను అంతర్జాతీయ చట్ట ఉల్లంఘన కిందకే వస్తాయని తెలిపాయి. ఈ చర్యలు పశ్చిమాసియాలో యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తాయని, అన్ని పక్షాలు దౌత్యపరమైన చర్చలకు తిరిగి రావాలని వెనిజులా, చిలీ, కొలంబియా దేశాల అధినేతలు తెలిపారు.

అమెరికా తమ గగనతలాన్ని ఉల్లంఘించిందని ఐరాస భద్రతామండలికి ఇరాక్‌ ఫిర్యాదు చేసింది. పొరుగు దేశాల భద్రతను అమెరికా చర్యలు ప్రమాదంలో పడేస్తున్నాయని, తమ దేశాన్ని యుద్ధ భూమిగా మార్చేందుకు అనుమతించబోమని లెబనాన్‌, జోర్డాన్‌ స్పష్టం చేశాయి.  అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించే ప్రమాదకరమైన, నిర్లక్ష్యపు చర్యగా ఒమన్‌ అభివర్ణించింది. ఎర్ర సముద్రంలో అమెరికా వాణిజ్య, నౌకాదళ ఓడలను లక్ష్యంగా చేసుకుంటామని హూతీ రెబల్స్‌ హెచ్చరించారు..మరోవైపు అమెరికా దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని పాక్‌ ఆందోళన వ్యక్తం చేసింది.