బీజేపీలో రాఘవ్ చద్దాతో సహా ఏడుగురు ఆప్ ఎంపీలు  

బీజేపీలో రాఘవ్ చద్దాతో సహా ఏడుగురు ఆప్ ఎంపీలు  
పంజాబ్ రాజ్యసభ ఎంపీ, కేజ్రీవాల్​కు అత్యంత ఆప్తుడిగా పేరున్న రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ సహా ఏడుగురు ఆప్ రాజ్యసభ ఎంపీలు భారతీయ జనతాపార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. బిజెపి నితిన్ నబిన్ సమక్షంలో ఆప్ రాజ్యసభ సభ్యులు రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ బీజేపీలో చేరారు. రాజ్యసభలోని ఆమ్ ఆద్మీ పార్టీ  ఎంపీలలో మూడింట రెండు వంతుల మంది బీజేపీలో విలీనమవుతున్నట్లు ప్రకటించారు. 
 
సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తాము బీజేపీలో చేరబోతున్నట్లు పాఠక్ తెలిపారు. పైగా, ఆప్ కి చెందిన రాజ్యసభ ఎంపీలలో దాదాపు మూడింట రెండు వంతుల మంది పార్టీని వీడారని, వీరంతా ఒక వర్గంగా బీజేపీలో చేరనున్నారని చద్దా వెల్లడించారు. పార్టీలో అసంతృప్తితో ఉన్న నాయకురాలు స్వాతి మలివాల్, హర్భజన్ సింగ్‌తో సహా పలువురు రాజ్యసభ ఎంపీలు కూడా ఆప్ ని వీడారని చద్దా తెలిపారు. ఆప్ కి  చెందిన మొత్తం 10 మంది రాజ్యసభ ఎంపీలలో ఏడుగురు పార్టీని వీడారని ఆ ముగ్గురూ పేర్కొన్నారు.
 
ఇటీవలే రాఘవ్ చద్దాను రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తొలగించిన ఆప్ ఆయన స్థానంలో అశోక్‌ మిట్టల్‌ను నియమించింది. ఇప్పుడు ఆయన కూడా పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.  రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టా మీడియా సమావేశంలో ఈ విషయం వెల్లడించారు.  అంటే రాజ్యాంగం ప్రకారం ఈ ముగ్గురూ కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారు.
ఇలా ఒక సభలో ఒక పార్టీకి చెందిన మూడింట రెండు వంతుల మంది సభ్యులు అధికార లేదా వేరే ఏ పార్టీలోనైనా చేరవచ్చు. ఇలా చేరితే, పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు. “రాజ్యసభలో ఆప్​ పార్టీకి ఉన్న 10 మంది ఎంపీల్లో 2/3వ వంతు మంది సభ్యులు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. అవినీతిపై పోరాడతామనే వాగ్దానంతో ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన పార్టీ, ఇప్పుడు నిజాయితీ గల రాజకీయాలకు దూరమైంది. అందుకే మేము సంతకాలు చేసి, బీజేపీలో విలీనం కావాలనే మా నిర్ణయాన్ని రాజ్యసభ ఛైర్మన్​కు పంపించాం” అని రాఘవ్ చద్దా తెలిపారు. 

ఇక, రాఘవ్ చద్దా, అశోక్, సందీప్.. ముగ్గురూ 2022 నుంచి ఆప్ తరఫున రాజ్యసభలో సభ్యులుగా కొనసాగుతున్నారు. తాజా మీడియా సమావేశంలో రాఘవ్ చద్దా మాట్లాడుతూ ‘‘ఆమ్ ఆద్మీ పార్టీ కోసం 15 ఏళ్లపాటు చెమట, రక్తం చిందించాను. ఇప్పుడు ఆ పార్టీ తన సిద్దాంతాలు, విలువలు, నైతిక అంశాల నుంచి పూర్తిగా పక్కకు తప్పుకొంది.

ఆమ్ ఆద్మీ పార్టీ తన స్వార్ధ ప్రయోజనాల కోసం తప్ప దేశం కోసం, జాతి ప్రయోజనాల కోసం పని చేయడం లేదు. ఇది చాలా మంది ఎప్పటినుంచో చెబుతున్నారు. ఇప్పుడు నేను కూడా అదే అనుకుంటున్నా. నేను సరైన పార్టీలో లేనని భావిస్తున్నా. సరైన వ్యక్తిని.. తప్పుడు పార్టీలో ఉన్నా. అందుకే ఈ రోజే ఆమ్ ఆద్మీ పార్టీకి దూరంగా ఉంటున్నా. ప్రజల కోసం వెళ్తున్నా’’ అంటూ ప్రకటించారు. తమతోపాటు స్వాతి మాలివాల్, హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, విక్రమ్‌జిత్ సింగ్ సహ్నే కూడా త్వరలో ఆప్‌ను వీడి బీజేపీలో చేరుతారు అంటూ రాఘవ్ వెల్లడించారు.

కాగా, చడ్డా బీజేపీలో చేరిన తర్వాత ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాఘవ్ చడ్డాకు పంజాబ్​లోని అధికార ఆప్​ ప్రభుత్వం జెడ్​-ప్లస్​ భద్రతను ఉపసంహరించుకున్న వెంటనే, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆయనకు భద్రత కల్పించడం గమనార్హం.