భారత దేశపు మెస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జీవితం ఆధారంగా రూపొందిన ‘లారెన్స్ ఆఫ్ పంజాబ్’ డాక్యుమెంటరీ సిరీస్ విడుదలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయవద్దని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ 5ని ఆదేశించింది.
వ్యవస్థీకృత నేరాలను గ్లామరైజ్ చేసేలా ఉన్న ఈ కంటెంట్ యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, ముఖ్యంగా సిద్ధూ మూసేవాలా హత్య వంటి సున్నితమైన అంశాలు పంజాబ్‌లో అశాంతికి దారితీస్తాయని పోలీసులు, రాజకీయ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ సిరీస్‌ను నిషేధించాలని కోరుతూ పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజా వారింగ్ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఐటీ చట్టం సెక్షన్ 69ఏ(1) కింద దీనిని నిలిపివేయాలని సైబర్ క్రైమ్ విభాగం కోరింది.
ఏప్రిల్ 27న విడుదల కావాల్సిన ఈ డాక్యుమెంటరీ హింసను ప్రేరేపించేలా ఉందని కేంద్రం అభిప్రాయపడింది. మరోవైపు, తమ అనుమతి లేకుండా ఈ సిరీస్ నిర్మించారని లారెన్స్ బిష్ణోయ్ కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ట్రైలర్‌ను తొలగించడంతో పాటు సిరీస్ విడుదలను నిలిపివేయాలని ప్రభుత్వం జీ5కి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

More Stories
హరిత హైడ్రోజన్ భవిష్యత్ ఇంధనం
బీజేపీలో రాఘవ్ చద్దాతో సహా ఏడుగురు ఆప్ ఎంపీలు
మొదటి దశ పోలింగ్ “మహా జంగిల్ రాజ్” అంతానికి “నాంది”