పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో నమోదైన రికార్డు స్థాయి పోలింగ్‌ను, తృణమూల్ కాంగ్రెస్ సాగిస్తున్న “మహా జంగిల్ రాజ్” (అరాచక పాలన) అంతానికి “నాంది”గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అభివర్ణించారు. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహిళా ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ టీఎంసీని మహిళా వ్యతిరేక పార్టీగా పేర్కొన్నారు.
డం డంలో జరిగిన ఒక ఎన్నికల సభలో ప్రసంగిస్తూ, తమ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని గ్రహించిన టిఎంసి గూండాలు ధైర్యం కోల్పోయారని ప్రధానమంత్రి ధ్వజమెత్తారు.మహిళలు అభివృద్ధి చెందడం టిఎంసికి ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. అయితే మహిళల భద్రతే బిజెపికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు.ఆర్ జి కర్ అత్యాచారం-హత్య కేసులో బాధితురాలి తల్లి అయిన రత్న దేబ్‌నాథ్‌కు తమ పార్టీ టికెట్ కేటాయించిందని కూడా ఆయన గుర్తుచేశారు.
“నిన్న బిజెపికి లభించిన అపూర్వ మద్దతు, ఆ పార్టీ విజయానికి శంఖారావం పూరించింది. పశ్చిమ బెంగాల్‌లో, టిఎంసి తన నిరంకుశ వైఖరితో ప్రజాస్వామ్య దేవాలయాన్ని అణచివేసి, బలహీనపరిచిన చోట ప్రజలు మొదటి దశలోనే ఆ ప్రజాస్వామ్య దేవాలయాన్ని పునర్నిర్మించడం ప్రారంభించారు,” అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.పశ్చిమ బెంగాల్‌లో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, టిఎంసి దుష్పరిపాలన, అవినీతి, చొరబాటుదారుల పట్టు నుండి ప్రజలకు విముక్తి కల్పిస్తుందని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు.
అధికార టీఎంసీని హెచ్చరిస్తూ, రాష్ట్రంలో మహిళలపై జరిగిన అన్ని అకృత్యాలపై దర్యాప్తును తమ పార్టీ తిరిగి ప్రారంభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. దీనిని ఆయన “మోదీ గ్యారెంటీ”గా అభివర్ణించారు.
“టీఎంసీ ఒక మహిళా వ్యతిరేక పార్టీ. బీజేపీ మహిళా నేతృత్వంలోని అభివృద్ధి నమూనాపై పనిచేస్తుంది. మీరు మా బీజేపీ పార్టీకి ఓటు వేయండి. ఏళ్ల తరబడి పడుతున్న కష్టాల నుంచి మేము బెంగాల్‌కు విముక్తి కల్పిస్తాం. టీఎంసీ భయం నుంచి విముక్తి, టీఎంసీ అవినీతి నుంచి విముక్తి, టీఎంసీ సిండికేట్ నుంచి విముక్తి, ఆడబిడ్డలపై జరుగుతున్న అకృత్యాల నుంచి విముక్తి, వలసల ఒత్తిడి నుంచి విముక్తి, నిరుద్యోగం నుంచి విముక్తి, చొరబాడుదారుల ఆక్రమణ నుంచి విముక్తి కల్పిస్తాం” అంటూ హామీ ఇచ్చారు.
మహిళలు రాత్రిపూట బయటకు రావద్దని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రధాని మోదీ తీవ్రంగా తప్పుబట్టారు. “బెంగాల్ కుమార్తెలు న్యాయం కోరినప్పుడు, అత్యాచారాల బారిన పడకుండా ఉండేందుకు ఇంటి గడప దాటి బయటకు రావద్దని టిఎంసి వారికి చెబుతోంది. మహిళలు కలలు కనడం టిఎంసికి ఇష్టం లేదు. ఈ రోజు, బెంగాల్‌లోని ప్రతి కుమార్తెకు నేను భరోసా ఇస్తున్నాను — బెంగాల్ కుమార్తెల కలలను ఎవరూ కాలరాయకుండా బిజెపి అడ్డుకుంటుంది,” అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
బెంగాల్ మహిళా శక్తిపై తనకు పూర్తి నమ్మకం ఉందని, వారు 21వ శతాబ్దపు బెంగాల్ కొత్త చరిత్రను రాస్తారని మోదీ ధీమా వ్యక్తం చేశారు. “బెంగాల్ మహిళా శక్తిని నేను చూస్తున్నాను. వారు 21వ శతాబ్దపు బెంగాల్ నవ చరిత్రను రాయనున్నారు. ఇకపై మేము టీఎంసీ ప్రభుత్వాన్ని మార్చితీరుతాం. ఇకపై మేము దానిని సహించమని బెంగాల్‌లోని ప్రతి మహిళ చెబుతోంది. బెంగాల్‌లోని ప్రతి ఆడబిడ్డకు నేను హామీ ఇస్తున్నాను. బీజేపీ మీ కలలను కలుషితం కానివ్వదు” అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
More Stories
బెంగాల్ తొలి దశ ఎన్నికల్లో బీజేపీకి 110 సీట్లు
బెంగాల్ లో 10 శాతం పెరిగిన పోలింగ్, తగ్గిన 12 శాతం ఓట్లు!
ట్రంప్ ‘నరక కూపం’ వ్యాఖ్యలపై అమెరికా దిద్దుబాటు చర్యలు