యోగా మానవతను పెంచే సామూహిక పక్రియ.. మోదీ

యోగా మానవతను పెంచే సామూహిక పక్రియ.. మోదీ
 
యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. యోగాకు హద్దులు లేవని, యోగాకు వయస్సుతో పనిలేదని చెప్పారు. విశాఖలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధాని యోగా ద్వారా ప్రపంచ దేశాలను ఏకం చేయవచ్చని  చెప్పారు.   
గత పదేళ్లలో కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపిందని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు. గ్రామగ్రామాల్లో యువకులు యోగాను అనుసరిస్తున్నారని చెప్పారు. 
ప్రకృతిలో మనిషి భాగస్వామి అని యోగా గుర్తు చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యోగాతో వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుందన్న ప్రధాని, యోగా ద్వారా నేను అన్న భావన మనంగా మారుతుందని చెప్పారు.  మనం అన్న భావన మానవత్వాన్ని పెంచుతుందని, ప్రపంచంలో అశాంతి, అస్థిరత పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.
 
‘‘ఇక్కడకు విచ్చేసిన ప్రజలందరికి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశంలో పుట్టిన యోగా నేడు ప్రపంచ దేశాలను ఏకం చేసింది. ప్రతి ఏటా యోగా దినోత్సవం నిర్వహించాలనే ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతిచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంత భారీ సంఖ్యలో.. దేశాల్లో యోగా చేయడం మామూలు విషయం కాదు. యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ” అని చెప్పుకొచ్చారు. 

యోగా వల్ల శాంతి, స్థిరత్వం సాధించవచ్చని, అంతర్గత శాంతి ప్రపంచ విధానం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతి అందరి క్షేమం కాంక్షిస్తుందన్న ప్రధాని, యోగాపై దేశంలోని అనేక వైద్యసంస్థలు పరిశోధన చేస్తున్నాయని తెలిపారు. యోగాను అనేక చికిత్సా విధానాల్లో భాగం చేస్తున్నాయని, గుండె, నరాల సమస్యలకు యోగా పరిష్కారంగా మారుతోందని చెప్పారు. 

మానసిక ఆరోగ్యానికి కూడా యోగా సహాయపడుతుందన్న ప్రధాని, అంతర్జాతీయ చికిత్సా కేంద్రంగా భారత్‌ మారుతోందని తెలిపారు. ఊబకాయం ప్రస్తుతం ప్రపంచ సమస్యగా మారుతోందన్న ప్రధాని మోదీ, పది శాతం నూనె వాడకం తగ్గిస్తే ఆరోగ్యం మెరుగవుతుందని సూచించారు. వంటల్లో పది శాతం నూనె తగ్గింపును ఛాలెంజ్‌గా స్వీకరించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతికి యోగా ఓ మార్గమని చెప్పారు.

యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్‌సెట్టర్‌గా మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రోజూ గంటపాటు యోగా చేయాలని పిలుపునిచ్చారు. 11వ యోగా దినోత్సవం రోజు విశాఖలో చరిత్ర సృష్టించబోతున్నామని పేర్కొన్నారు. యోగా దినోత్సవాన్ని 130 దేశాల్లో జరుపుకుంటున్నారని చెబుతూ యోగాను ప్రధాని మోదీ విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తాయని ఉద్ఘాటించారు. 
 
ఈ కార్యక్రమంలో దాదాపు 1.44 లక్షల మంది యోగా శిక్షకులు నమోదు చేసుకున్నారని ఈ సందర్భంగా వెల్లడించారు. వికసిత్‌ భారత్‌లో భాగంగా రాష్ట్రాన్ని హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీగా మారుద్దామని ప్రజలందరికీ సీఎం పిలుపునిచ్చారు. శరీరం, మనస్సు, ఆత్మల కలయికే యోగా అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. యోగా వల్ల రోగనిరోధక శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని సీఎం తెలిపారు
 
యోగా విశిష్టతను రుగ్వేదం చెబితే దాన్ని మోదీ విశ్వవ్యాప్తం చేశారని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కొనియాడారు. ప్రపంచ యోగా దినోత్సవం భారతావనికి దక్కిన గొప్ప గౌరవమని పవన్‌ అభిప్రాయపడ్డారు. మోదీ సమక్షంలో చంద్రబాబు కృషితో ప్రపంచ రికార్డు సాధించబోతున్నామని పవన్‌ ఆనందం వ్యక్తం చేశారు.  గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, కేంద్రమంత్రులు జాదవ్‌ ప్రతాప్‌రావు, రామ్మోహన్‌, శ్రీనివాస్‌ వర్మ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.