
* మొఖం చాటేస్తున్న ఇరాన్ పెంచి పోషించిన ఉగ్రవాదులు, మిత్ర దేశాలు
ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ ఏకాకిగా మారిందా? తన వద్దనున్న మిస్సైళ్లు, డ్రోన్లతో ఒంటరి పోరాటం చేస్తోందా? రష్యా, చైనా, ఉత్తర కొరియా లాంటి మిత్రదేశాలతో పాటు ఇరాన్ పెంచిపోషించిన మిలిటెంట్ సంస్థలూ సహాయం చేయడం లేదా? గత వారం రోజుల ఇరాన్ – ఇజ్రాయెల్ ఘర్షణను చూస్తుంటే ఆ ప్రశ్నలకు ఔను అనే సమాధానాలే వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఒకవేళ ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ అణ్వాయుధాన్ని సమకూర్చుకున్నా ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌లా ఒంటరిపక్షిగా మిగిలిపోవాల్సి వస్తుందని రాజకీయ పరిశీలకులు భావిన్నారు. లెబనాన్‌లో హిజ్బొల్లా, పాలస్తీనాలో హమాస్, యెమెన్‌లో హౌతీలు, ఇరాక్‌లో షియా తీవ్రవాద గ్రూపులు.. ఇవన్నీ ఇరాన్‌కు మిత్రులే. ఇజ్రాయెల్‌కు శత్రువులగా ఉన్న వీటికి ఇరాన్ ఆర్థిక, ఆయుధ సాయం కూడా అందిస్తున్నది.
నాలుగు దశాబ్దాలుగా పశ్చిమాసియా అంతటా ఇరాన్ వీటన్నింటితో కలిపి ప్రచ్ఛన్న దళాలను నిర్మించింది. అమెరికా, ఇజ్రాయెల్‌తో తాను నేరుగా తలపడకుండా ఇరాన్ వీటిని ఎగదోస్తున్నది. కానీ ప్రస్తుతం కష్టకాలంలో ఉన్న ఇరాన్‌కు ఇవన్నీ కంటికి కానరానంత దూరంలో ఉండిపోయాయి. ఊపిరి కూడా తీసుకోనివ్వకుండా ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న తరుణంలో ఈ ఇరాన్ మిత్ర సంస్థలన్నీ అనుమానాస్పద రీతిలో మౌనం వహిస్తున్నాయి.
వీటిలో కొన్ని సంస్థలు గ్రూపులుగా విడిపోయాయి, మరికొన్ని తీవ్రంగా బలహీనపడ్డాయి, అంతర్గత పోరుతో సతమతమవుతున్నాయి. దీంతో ఇరాన్ ఒంటరిగా మిగిలిపోయినట్టు తెలుస్తున్నది. ఇరాన్‌కు అత్యంత శక్తిమంతమైన మిత్రునిగా ఉన్న షియా పారామిలిటరీ గ్రూపు హిజ్బొల్లా సంస్థ ఇంతవరకు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఎటువంటి చర్య చేపట్టలేదు.
ఏడాది క్రితం ఎంతో శక్తిమంతంగా ఉన్న హిజ్బొల్లాను ఇజ్రాయెల్ గత ఏడాది చావుదెబ్బ కొట్టింది.
హమాస్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై హిజ్బొల్లా సంస్థ రాకెట్లు ప్రయోగించింది. దీంతో హిజ్బొల్లాకు సుదీర్ఘ కాలం నాయకునిగా ఉంటూ వచ్చిన హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. ఆయన స్థానంలో నాయకుడిగా ఎంపికైన నయీం ఖాస్సెమ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇరాన్ మిత్రునిగా కాకుండా లెబనాన్ ప్రతినిధిగానే మాట్లాడారు. ఆయన కార్యాలయంలో ఇరాన్ నాయకుడు ఖమేనీ చిత్రపటం అదృశ్యమైందని అమెరికా వార్తా పత్రిక పేర్కొంది.
ఇరాన్ నుంచి అన్ని రకాలుగా సాయం పొందిన హమాస్ సంస్థ గత రెండేండ్లుగా ఇజ్రాయెల్‌తో పోరాటంలో పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది. దాని సీనియర్ నేతలందరూ హతమయ్యారు. ఇక ఇరాక్‌లో ఇరాన్‌కు మిత్రులుగా ఉన్న షియా తీవ్రవాద గ్రూపులు గత జనవరి వరకూ అమెరికన్ సైనికులను వేధించేందుకు ఉపయోగపడ్డారు. కానీ జనవరిలో ఇరాన్ భూభాగంపై ఇజ్రాయెల్ బాంబులు వేయడంతో వీరంతా మన్ను తిన్న పాములా మారిపోయారు.
ఇక యెమెన్‌లోని హౌతీలను గత మార్చి, ఏప్రిల్ నెలల్లో అమెరికా వైమానిక దాడులు చేసి పూర్తిగా నిర్వీర్యం చేసింది. హౌతీ మిలిటెంట్లు యెమన్ దేశం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. వీరిని పెంచిపోషిస్తున్నది ఇరానే. సముద్ర మార్గంలో హౌతీలకు మిస్సైళ్లు, రాకెట్లు, డ్రోన్లను ఇరాన్ చేరవేస్తుంటుంది. ఇరాన్ నుంచి సిగ్నల్స్ అందగానే ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యంగా దాడులు చేయడమే హౌతీల పని. యెమన్‌లోని కొంత భూభాగం హౌతీల కంట్రోల్‌లో ఉంది.
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లలో హౌతీల ఆయుధ గోదాములపై అమెరికా దాడులు చేసింది. దీంతో వారి వద్దనున్న మిస్సైల్ బ్యాటరీలన్నీ ధ్వంసమయ్యాయి. ఫలితంగా ప్రస్తుతానికి పెద్దసంఖ్యలో మిస్సైళ్లను ప్రయోగించే సామర్ధ్యంను హౌతీలు కోల్పోయారు. ఇరాన్‌కు పశ్చిమాసియా వెలుపల కూడా బలమైన మిత్రులు ఉన్నారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా వంటి దేశాలు ఇరాన్‌కు మిత్రులే కాకుండా అత్యంత శక్తిమంతమైనవి కూడా.
కానీ ప్రస్తుతం రష్యా ఆచితూచి స్పందిస్తున్నది. అది ఇంతవరకు ఇజ్రాయెల్ దాడులను ఖండించడం వరకే పరిమితమైంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ నుంచి భారీగా చమురును కొనుగోలు చేస్తున్న చైనా పరోక్షంగా ఆ దేశానికి ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నది. కానీ ప్రస్తుతం అది మధ్యవర్తిత్వం వహించడానికే మొగ్గు చూపుతున్నది. రహస్యంగా కొన్ని ఆయుధాలను సరఫరా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇరాన్ అణు కార్యక్రమానికి, క్షిపణుల ఉత్పత్తికి సహాయపడినట్టు ఆరోపణలున్న ఉత్తరకొరియా మాత్రం ఇంతవరకు తన వైఖరిని వెల్లడించలేదు. భారత్ ఇటు ఇరాన్‌తో అటు ఇజ్రాయెల్‌తో సంబంధాలను నెరుపుతున్నది. ఇజ్రాయెల్‌తో అనేక రంగాల్లో భాగస్వామిగా ఉన్న భారత్ ఇరాన్‌కు ప్రాంతీయ, వ్యూహాత్మకంగా భాగస్వామిగా ఉన్నది. ఇరాన్‌లోని పోర్టును నిర్మించి, పదేళ్ల పాటు నిర్వహించేందుకు సంబంధించిన ఒప్పందంపై భారత్ సంతకం చేసింది. ఈ క్రమంలో భారత్ ఎవరికీ మద్దతును ప్రకటించలేదు. అలాగే, ఇది యుద్ధాల కాలం కాదని తన వైఖరిని స్పష్టంగా ప్రపంచానికి చెప్పింది.
More Stories
1977లో ఓటమి భయంతో ఆర్ఎస్ఎస్ చెంతకు ఇందిరా గాంధీ!
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!
‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్