స్విస్ బ్యాంకుల్లో 18 శాతం తగ్గిన భారతీయుల డిపాజిట్లు

స్విస్ బ్యాంకుల్లో 18 శాతం తగ్గిన భారతీయుల డిపాజిట్లు

గత పదేళ్లలో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు దాదాపు 18 శాతం తగ్గాయి. 2015లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు సుమారు 425 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌ లు (సుమారు రూ.45,000 కోట్లు) ఉండగా, అవి 2024 నాటికి 346 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌ లకు (రూ.36,600) తగ్గాయి. ఈ మేరకు స్విస్ నేషనల్ బ్యాంక్ తాజా గణాంకాలను విడుదల చేసింది.

స్విస్ నేషనల్ బ్యాంక్ డేటా ప్రకారం, కరోనా మహమ్మారి సమయంలో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు గణనీయంగా పెరిగాయి. ఈ డిపాజిట్లు పది సంవత్సరాల గరిష్ఠ స్థాయి 602 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌ లను తాకాయి. అయితే కొవిడ్ ముగిసిన తర్వాత స్విస్ బ్యాంకులో మళ్లీ భారతీయుల డిపాజిట్లు తగ్గడం ప్రారంభించాయి. 2023లో 309 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌ ల డిపాజిట్లు ఉన్నాయి. 

2024లో అవి 37 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌ లు పెరిగి 346 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌ లకు చేరుకున్నాయి. ఈ వార్షిక పెరుగుదల ఉన్నప్పటికీ గత దశాబ్ద కాలంలో డిపాజిట్లు తగ్గాయి. అయితే, స్విస్ బ్యాంకులో భారతీయుల డిపాజిట్లు మాత్రమే కాదు. ప్రపంచంలోని అనేక ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలు ఉన్న దేశస్థుల డిపాజిట్లు కూడా తగ్గుముఖం పట్టాయి.

యూకే జాతీయుల డిపాజిట్లు 2015లో 44 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌ ల నుంచి 2024 నాటికి 31 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌ లకు తగ్గాయి. చైనా దేశస్థుల డిపాజిట్లు కూడా తగ్గుముఖం పట్టాయి. 5.01 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌ ల నుంచి 4.3 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌ లకు తగ్గాయి. భారత్ పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశీయుల కూడా స్విస్ బ్యాంకులో డిపాజిట్లను తగ్గించారు.

గత పదేళ్లలో స్విస్ బ్యాంకుల్లో పాకిస్థాన్ జాతీయుల డిపాజిట్లు భారీగా తగ్గాయి. పాకిస్థాన్ దేశస్థుల డిపాజిట్లు 2015లో 947 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌ లుగా ఉన్నాయి. కానీ 2024 నాటికి 241 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌ లకు గణనీయంగా తగ్గాయి. డిపాజిట్లలో దాదాపు 75 శాతం తగ్గుదల కనిపించింది. బంగ్లాదేశ్ జాతీయుల విషయంలో కూడా ఇదే ధోరణి కన్పించింది. 

స్విస్ బ్యాంకుల్లో బంగ్లా దేశీయుల డిపాజిట్లు 2015లో 48 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌ లు ఉన్నాయి. 2024లో కేవలం 12.6 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌ లకు తగ్గాయి. దాదాపు 73 శాతం డిపాజిట్లు తగ్గాయి. సౌదీ అరేబియా పౌరుల డిపాజిట్లు గత పదేళ్లలో దాదాపు సగానికి తగ్గాయి. 2015లో 8.3 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌ ల డిపాజిట్లు ఉండేవి. అవి 2024 నాటికి 4.8 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌ లకు తగ్గాయి.

అమెరికన్ జాతీయుల డిపాజిట్లలో కూడా భారీ తగ్గుదల కనిపించింది. స్విస్ బ్యాంకుల్లో వారి డిపాజిట్లు 2015లో 64.2 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌ లు ఉండేవి. 2024 నాటికి అవి 24.4 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌ లకు పడిపోయాయి. దాదాపు 62 శాతం తగ్గుదల కనిపించింది. స్విస్ నేషనల్ బ్యాంక్ విడుదల చేసిన డేటా ప్రకారం, స్విస్ బ్యాంకుల్లో విదేశీ డిపాజిట్లు తగ్గుతున్న విస్తృత ధోరణి కనిపించింది.

నిబంధనలను కఠినతరం చేయడం, పెరిగిన పరిశీలన, అంతర్జాతీయ ఆర్థిక పారదర్శకత నిబంధనలలో మార్పులు వంటి వివిధ కారణాల వల్ల స్విస్ బ్యాంకుల్లో విదేశీ డిపాజిట్లు తగ్గుతున్నాయి. గత దశాబ్దంలో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు తగ్గాయి. అయితే, 2021లో కరోనా సమయంలో డిపాజిట్లలో తాత్కాలిక పెరుగుదల కనిపించింది. ఆ తర్వాత మళ్లీ డిపాజిట్లు తగ్గుముఖం పట్టాయి.