
అస్సాంలో సుమారు 5000 విదేశీ ఫేస్‌బుక్ ఖాతాలు అకస్మాత్తుగా యాక్టివ్ అయ్యాయని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. 2026 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయాలన్న లక్ష్యంతో పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అసోం కాంగ్రెస్‌కు మద్దతుగా ముస్లింల దేశాల నుంచి 5,000కు పైగా సోషల్ మీడియా ఖాతాలను గత నెల అకస్మాత్తుగా క్రియేట్ చేసినట్లు వెల్లడించారు.
ఈ విషయాన్ని జాతీయ భద్రతకు సంబంధించి ముఖ్య అంశంగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించినట్లు చెప్పారు. దాదాపు బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గనిస్థాన్ సహా మొత్తం 47 దేశాల నుంచి వీటిని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఈ కొత్త ఫేస్‌బుక్ ఖాతాల విశ్వసనీయత కోసం ఐఐటీ గౌహతిని తమ లొకేషన్‌గా పేర్కొన్నారని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
ఇప్పటి వరకు 2,092 ఖాతాలను విశ్లేషించినట్లు సీఎం శర్మ చెప్పారు. బంగ్లాదేశ్ నుంచి 700కి పైగా, పాకిస్థాన్ నుంచి 350, పశ్చిమాసియా నుంచి 500కి పైగా ఇలాంటి సోషల్ మీడియా ఖాతాలు క్రియేట్ చేసినట్లు ఆయన చెప్పారు. ఈ ఖాతాలన్నీ ఇస్లామిక్ భావజాలం కలిగిన వ్యక్తులే నిర్వహిస్తున్నారని, వీరు అసోంలోని ఓ కాంగ్రెస్ నేతను మాత్రమే ఫాలో అవుతున్నారని ఆయన చెప్పారు.
కొత్తగా సృష్టించిన ఈ ఫేస్‌బుక్ ఖాతాలతోపాటు వాటి వెనుక ఉన్న వ్యక్తులపై ప్రభుత్వం నిఘా పెట్టిందని తెలిపారు. “వారు కఠినమైన ఇస్లామిక్ ఛాందసవాద కంటెంట్‌ను మాత్రమే పోస్ట్ చేస్తున్నారు. తరచుగా అస్సాం చుట్టూ ఉన్న రాజకీయ కథనాలతో కలుపుతారు. అస్సాం గురించి పోస్ట్ చేయనప్పుడు, వారు ఇరాన్, ఇరాక్, పాలస్తీనా లేదా ఉమ్రా వంటి మతపరమైన విషయాలకు సంబంధించిన కంటెంట్‌ను పంచుకుంటారు” అని శర్మ తెలిపారు.
అస్సాం ముఖ్యమంత్రి ప్రకారం, ఈ ఖాతాలలో చాలా వరకు కొత్తగా సృష్టించారు. విశ్వసనీయతను పొందడానికి తరచుగా వాటి స్థానాన్నిఐఐటి గౌహతిగా జాబితా చేస్తున్నారు. “మేము ఐఐటి గౌహతితో తనిఖీ చేసాము. అలాంటి వ్యక్తుల రికార్డులు ఏవీ కనుగొనలేదు. బహిర్గతమైన రెండు ఖాతాలు బంగ్లాదేశ్, పాకిస్తాన్‌కు చెందినవిగా గుర్తించాము. వారు ప్రజలను తప్పుదారి పట్టించడానికి తప్పుడు గుర్తింపులు, చిరునామాలను ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది” అని ఆయన పేర్కొన్నారు.
గౌహతిలో స్థానిక సంబంధం ఉందని, వివరాలు అస్పష్టంగా ఉన్నప్పటికీ, జిఎస్ రోడ్, ఖర్ఘులి ప్రాంతాలను ప్రస్తావిస్తూ ఆయన సూచించారు. “ఇది దాదాపు ఒక నెల నుండి జరుగుతోంది. నేను ఎవరి పేరు చెప్పను, కానీ మేము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాము. ఈ వ్యక్తులు వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా ఏదైనా వివాదాస్పద సంఘటన తర్వాత వారు చురుకుగా మారతారు” అని ఆయన వివరించారు.
More Stories
భారత్‌కు నష్టం కలిగించారనే ఒక్క ఫొటో చూపించగలరా?
1977లో ఓటమి భయంతో ఆర్ఎస్ఎస్ చెంతకు ఇందిరా గాంధీ!
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!