గిన్నిస్ రికార్డు సృష్టించిన విశాఖ యోగాంధ్ర

గిన్నిస్ రికార్డు సృష్టించిన విశాఖ యోగాంధ్ర
3 లక్షలకుపైగా ప్రజలు పాల్గొన్న యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. గతంలో సూరత్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో లక్షా 47 వేల మంది పాల్గొనగా, 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదికైన విశాఖలో 3 లక్షలకు పైగా ప్రజలు భాగస్వాములయ్యారు.  ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో యోగాంధ్ర ఈ గిన్నిస్ రికార్డును సాధించింది.
ఒకేసారి మూడు లక్షల మంది ప్రజలు ఆసనాలు వేయడం ఇంతకు ముందు ఎక్కడా జరగలేదు. సూరత్ రికార్డ్‌ను అధిగమించడడంతో ప్రభుత్వ వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ‘యోగా ఫర్‌ వన్‌ ఎర్త్‌-వన్‌ హెల్త్‌’ 11వ అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి నినాదంగా మారింది. విశాఖ ఆర్కే బీచ్‌ నుంచి భోగాపురం వరకు లక్షలాది మంది ప్రజలు యోగాసనాలు వేశారు.  ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్​  సహా పలువురు మంత్రులు పాల్గొని 45 నిమిషాలపాటు యోగాసనాలు వేశారు.

కాగా, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గిరిజన విద్యార్థులు గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో అల్లూరి జిల్లాలోని 106 పాఠశాలలకు చెందిన 25వేల మంది విద్యార్థులు పాల్గొని 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధులు పర్యవేక్షించారు.

యోగాంధ్ర గిన్నిస్ రికార్డుల పట్ల మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానికి గిన్నిస్‌ రికార్డు కానుకగా ఇవ్వాలనే లక్ష్యంతో ప్రజల్లో యోగాంధ్రపై చైతన్యం తీసుకువచ్చామని వెల్లడించారు. ఆశించిన దానికంటే ఎక్కువ మంది యోగాంధ్రకు వచ్చారని తెలిపారు. దక్షిణ భారతదేశంలో ఉన్నతమైన ఐటీ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ యోగా డే నిర్వహణ ప్రపంచ దృష్టిని ఆకర్షించగలిగిందని ఆయన చెప్పారు.

 
ఈ సందర్భంగా కేంద్ర ఆయుష్‌ శాఖా మంత్రి ప్రతా్‌పరావ్‌ జాదవ్‌ మాట్లాడుతూ అడవి బిడ్డలు రికార్డు నెలకొల్పడం ఆనందంగా ఉందన్నారు. ఇందులో భాగస్వాములైన విద్యార్థులను ఆయన అభినందించారు. ప్రపంచ రికార్డు సృష్టించడం ద్వారా దేశ గౌరవాన్ని మరింత పెంపొందించారని కొనియాడారు. వీరిని పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
మరోవంక, విశాఖలో ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శ్రీకాకుళం నుంచి సైకిల్‌పై బయల్దేరారు. శుక్రవారం ఉదయం అరసవల్లి శ్రీసూర్యనారాయణ సన్నిధిలో సన్నిహితులతో కలసి సూర్య నమస్కారాలు చేసిన అనంతరం సైకిల్‌ ర్యాలీని ప్రారంభించి తాను కూడా సైకిల్‌పై విశాఖకు చేరుకున్నారు.