
గన్నాథుడి పుణ్యభూమి అయిన ఒడిశాకు వెళ్లడం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానాన్ని తాను సున్నితంగా తిరస్కరించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రాజధాని భువనేశ్వర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మోదీ పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం పాలిస్తున్న రాష్ట్రాల్లో సామాజిక ఆర్థిక అభివృద్ధి విషయంలో నవశకం ప్రారంభమైందని మోదీ చెప్పారు.
సుపరిపాలన, ప్రజాసేవలో బీజేపీ సర్కార్ ఒడిశాలో ఏడాది పూర్తి చేసుకుందని పేర్కొన్నారు. అదే సమయంలో ఇటీవల కెనడాలో జరిగిన జీ7 సదస్సుకు వెళ్లిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు. ఆ సమయంలో ట్రంప్ తనకు ఫోన్ చేశారని, వాషింగ్టన్ మీదుగా వెళ్లాలని సూచించారని, ఇద్దరం కలిసి విందులో పాల్గొందామని, పలు విషయాలపై చర్చించుకుందామని ట్రంప్చెప్పారని మోదీ వెల్లడించారు.
కానీ తనకు జగన్నాథుడి పుణ్యభూమికి వెళ్లడమే ముఖ్యమని చెప్పినట్లు తెలిపారు. అలా ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు చెప్పారు. పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారాన్ని తెరవాలన్న ప్రజల డిమాండ్‌ను తమ సర్కార్ నెరవేర్చిందని మోదీ గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో దేశంలో సుపరిపాలనకు చోటు లేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు.
ఒడిశాలో గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. అప్పటి ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని విమర్శించారు. ఆ విషయంలో గత సర్కార్ విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాలు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచాయని తెలిపారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని చెప్పారు.
“దేశంలోని 125కు పైగా గిరిజన ప్రాబల్య జిల్లాలు చాలా సంవత్సరాలుగా మావోయిస్టుల ప్రభావానికి గురయ్యాయి. ఈ ప్రాంతాలకు ‘రెడ్ కారిడార్’ వంటి చెడ్డ పేరు వచ్చింది. ఈ జిల్లాల్లో ఎక్కువ భాగం వెనుకబడ్డ ప్రాంతాలుగా ప్రకటించారు. అప్పటి ప్రభుత్వాలు వాటిని అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకోలేదు” అని ప్రధాని ధ్వజమెత్తారు. “దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన పార్టీ గిరిజన సమాజాన్ని నిర్లక్ష్యం చేసి, వాటిని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంది” అని ఆయన కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమర్శించారు. బిహార్‌లో పర్యటనను ముగించుకుని ఒడిశా వచ్చిన మోదీ, రూ.18,600 కోట్ల విలువైన 105 ప్రాజెక్టులను ప్రారంభించారు.
More Stories
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!
ఐదేళ్లలో వెయ్యి కొత్త రైళ్లు.. 2027 నాటికి బుల్లెట్ రైలు
నకిలీ ఆధార్ కార్డుల తయారీలో బెంగాల్ లో నలుగురు అరెస్ట్