
ఉగ్రవాదం విషయంలో భారత్ స్పష్టమైన వైఖరితో ఉందని అంటూ దాయాది పాకిస్థాన్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి గట్టిగా హెచ్చరించారు. ఇకపై ఉగ్రవాదానికి భారత్ బాధితురాలిగా మిగిలిపోదని వ్యాఖ్యానించారు. ఉగ్ర చర్యలకు వ్యూహాత్మకంగా బదులిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ తో బలమైన సందేశం పంపామని గుర్తు చేశారు.
‘ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు. ఇది కేవలం విరామం మాత్రమే’ అని తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో నార్తర్న్ కమాండ్ వద్ద సైనికులతో కలిసి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటూ ‘ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులకు, వారిని పోషిస్తున్న వారికి గట్టి సందేశం ఇచ్చాం. ఇకపై భారత్ ఉగ్రవాద బాధితురాలిగా ఉండదని, బలమైన వ్యూహంతో స్పందిస్తుందని శక్తివంతమైన సందేశాన్ని పంపాం’ అని రాజ్‌నాథ్ చెప్పారు.
పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయడంలో సాయుధ దళాలు, నిఘా సంస్థల కృషిని ఆయన ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, సరిహద్దు దాటి ఉగ్రవాదులకు, వారికి మద్దతు ఇచ్చే వారికి ఓ హెచ్చరిక అని తెలిపారు. భారత్ ఇకపై ఉగ్రవాదాన్ని సహించదని స్పష్టం చేశారు. దేశ ఐక్యత, సమగ్రతకు హాని కలిగిస్తే తగిన సమాధానం ఇస్తుందని హెచ్చరించారు.
సాయుధ దళాలతో సన్నిహితంగా ఉండే అవకాశం తనకు లభించిందని చెబుతూ యోగా పట్ల వారి బలమైన అభిరుచిని గమనించానని రక్షణ మంత్రి తెలిపారు. చాలా మంది సైనికులు క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తారని, దాని ప్రభావం వారి క్రమశిక్షణ, కర్తవ్య నిర్వహణలో అంకితభావంపై స్పష్టంగా ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. సైనికులను శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా సిద్ధం చేయడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు. ఈ సమగ్ర అభివృద్ధి యుద్ధభూమిలో కూడా కనిపించే స్పష్టమైన ప్రయోజనాలను తెస్తుందని ఆయన తెలిపారు.
More Stories
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!
ఐదేళ్లలో వెయ్యి కొత్త రైళ్లు.. 2027 నాటికి బుల్లెట్ రైలు
నకిలీ ఆధార్ కార్డుల తయారీలో బెంగాల్ లో నలుగురు అరెస్ట్