
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ ముస్తాబవుతోంది. చరిత్రలో నిలిచిపోయేలా యోగాంధ్ర-2025కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేచోట 5 లక్షల మంది యోగాసనాలు వేసేలా అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్కేబీచ్ వద్ద 15 వేల మందితో యోగాసనాల కార్యక్రమంలో ప్రధాని పాల్గొనే ప్రధాన వేదికను సిద్ధం చేశారు.
అదేవిధంగా ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల పరిధిలో విద్యుత్ దీపాలు, ఎల్‌ఈడీ స్క్రీన్‌లు, బారికేడ్లు, రహదారిపై మ్యాట్‌లు, శిక్షకులకు వేదికలు ఇలా సర్వం సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ వర్షం పడితే కార్యక్రమాన్ని కొనసాగించేందుకు వీలుగా ఆంధ్ర వర్సిటీలో ప్రత్యామ్నాయ వేదిక సిద్ధం చేస్తున్నారు. ప్రజలు గందరగోళానికి గురికాకుండా క్యూఆర్ కోడ్‌తో కూడిన సమాచారాన్ని అందుబాటులో ఉంచారు.
యోగాంధ్రలో పాల్గొనేందుకు ముందే రిజిస్ట్రేషన్ చేసుకోకపోయిన వారూ అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరికీ యోగా మ్యాట్‌తోపాటు కిట్, వాటర్ బాటిల్, రెయిన్‌కోట్ ఇవ్వనున్నారు. ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ప్రతి కిలోమీటర్‌కు ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంచనున్నారు.
ప్రతి కంపార్ట్ మెంట్లో ఒక శిక్షకుడు, ఇద్దరు పోలీసులు, వైద్య సిబ్బంది, ఒక సహాయకులు ఉండేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు 326 కంపార్ట్‌మెంట్ల బాధ్యతలను ఏడుగురు ఐఏఎస్ అధికారులకు అప్పగించారు. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లకు సేవలపై శిక్షణ ఇచ్చారు. మొత్తం 6300 మంది వాలంటీర్లను ఈ కార్యక్రమానికి వినియోగించనున్నారు.
మరోవైపు ప్రధాని సహా వీఐపీలు వస్తున్నందున ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. 10,000ల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి నగరమంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతీ క్షణం పరిశీలిస్తున్నారు. డ్రోన్లతోనూ ప్రత్యేక నిఘా పెట్టారు. బయట నుంచి వచ్చేవారు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా వచ్చి, వెళ్లేలా ప్రణాళికపై అధికారులు ఫోకస్ పెట్టారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ యోగాంధ్ర కొనసాగేలా ఏర్పాట్లు చేశామంటున్న హోంమంత్రి వంగలపూడి అనితతో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి.
More Stories
టిటిడిలో వేయి మందికి పైగా అన్యమతస్థులు
అధిక పొగ వాహనాలకు తిరుమలలో ప్రవేశం లేదు
అన్యమత ప్రార్థనల్లో టీటీడీ ఏఈఓ సస్పెండ్