
జలాల వినియోగంపై తెలుగు రాష్ట్రాలు ఒకరిపై మరొకరు పోరాడాల్సిన అవసరం లేదని, కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హితవు చెప్పారు. బానకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యంతరాలను ప్రస్తావిస్తూ సముద్రంలో కలిసే నీటి వాడకంపై సమస్య సృష్టించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. గోదావరి జలాల కోసం గొడవ పడటం తెలుగు రాష్ట్రాలకు మంచిది కాదని స్పష్టం చేస్తూ ఇద్దరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు వెళ్దామని తెలంగాణకు సూచించారు.
గోదావరి నీళ్లను ఇరు రాష్ట్రాలు వాడుకుంటున్నాయని, పోలవరం తప్ప మిగతావన్నీ అనుమతి రాని ప్రాజెక్టులేనని ఆయన గుర్తు చేశారు. మనం మనం కొట్లాడుకుంటే ఎవరికి లాభం? తెలంగాణపై ఎప్పుడైనా గొడవ పడ్డానా? కృష్ణాలో తక్కువ నీటిపై గొడవ పడితే లాభం లేదని తెలిపారు. కొత్త ట్రైబ్యునల్ వచ్చాక కేటాయింపుల మేరకు ముందుకెళ్లాలని పేర్కొంటూ ఏపీ, తెలంగాణ ఎవరి శక్తి మేరకు వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుందామని సూచించారు.
గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, కృష్ణానదిలో మాత్రమే నీళ్లు తక్కువగా ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. కొత్త అథారిటీ ఎలా కేటాయిస్తే అలా తీసుకుందామని చెబుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు తాను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని చంద్రబాబు గుర్తు చేశారు. బనకచర్లతో ఎవరికీ నష్టం లేదని స్పష్టం చేస్తూ తెలంగాణ పై భాగంలో ఉందని, కింద ఉన్న ఏపీ నీళ్లు వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు.
సముద్రంలో కలిసే నీళ్లు వాడుకుంటామంటే రాద్ధాంతాలు, అభ్యంతరాలు ఎందుకు అని అడిగారు. తెలంగాణలోనూ ప్రాజెక్టులు కట్టాలని, ప్రజలు, రైతులు అందరూ బాగుండాలని కోరుకుంటాను కానీ ప్రజా ప్రయోజనాల విషయంలో రాజకీయాలు చేయనని హితవు చెప్పారు. అనవసరంగా గొడవలు చేసి ప్రజలను మభ్యపెట్టొద్దని రెండు రాష్ట్రాల నాయకులకు చంద్రబాబు సూచించారు. అయితే, బనకచర్లపై తెలంగాణ కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదని, ఎవరికీ అన్యాయం జరగకుండా చూద్దామని చెబుతున్నారని అంటూ చెప్పుకొచ్చారు.
“గోదావరిలో నీళ్లను ఇరు రాష్ట్రాలు వాడుతున్నాయి. పోలవరం తప్ప మిగతావి అనుమతి రాని ప్రాజెక్టులే. విభజన చట్టంలో భాగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. ఇక్కడికి వచ్చిన నీటిని మరో బేసిన్‌కు తరలిస్తున్నాం. గతంలో కృష్ణా బ్యారేజ్‌పై ఇరు రాష్ట్రాల సిబ్బంది గొడవ పడ్డారు. గవర్నర్ వద్ద కూర్చుని గతంలో సమస్య పరిష్కరించుకున్నాం. కృష్ణాలో తక్కువ ఉన్న నీటిపై గొడవ పడితే లాభం లేదు. ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులను అలాగే కొనసాగిద్దాం. కొత్త ట్రైబ్యునల్ వచ్చాక కేటాయింపుల మేరకు ముందుకెళ్లాలి” అని చంద్రబాబు సూచించారు.
More Stories
కాకినాడ మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపులు
టిటిడిలో వేయి మందికి పైగా అన్యమతస్థులు
అధిక పొగ వాహనాలకు తిరుమలలో ప్రవేశం లేదు