ప్రముఖ సాహితీవేత్త పులిచెర్ల సాంబశివరావు ఇక లేరు

ప్రముఖ సాహితీవేత్త పులిచెర్ల సాంబశివరావు ఇక లేరు

ప్రఖ్యాత సాహితీవేత్త, జెకేసి కళాశాల ఆంధ్ర (తెలుగు) ఉపన్యాసకులుగా, విభాగాధిపతిగా పదవీ విరమణ చేసిన డా. పులిచెర్ల సాంబశివరావు (78) అనారోగ్య కారణాల రీత్యా గురువారం ఉదయం గుంటూరులో స్వగృహంలో కన్నుమూశారు. సాహిత్యంపై భారతితో సహా పలు పత్రికలలో వ్యాసాలు వ్రాసిన ఆయన అనేక చారిత్రక గ్రంధాలను కూడా రచించారు. అక్బర్ ను ఎదిరించి స్వాభిమానానికి, భారతీయ పౌరుషానికీ ప్రతీకగా నిలిచిన మహారాణా ప్రతాప్ జీవితాన్ని నవల రూపంలో తెలుగు పాఠకులకు అందించారు.

వీరపాండ్య కట్టబ్రహ్మన  జీవితాన్ని వీరి అన్నగారు పులిచెర్ల సుబ్బారావు నాటక రూపంలో అందించగా,  వీరు దానిని సులభంగా చదువుకోవడానికి వీలుగా నవలగా మలిచారు. మాజీ ఎమ్యెల్సీ, ప్రముఖ రచయిత మన్నవ గిరిధరరావు  ప్రారంభించిన `భారతీయ మార్గము’ మాసపత్రిక నిర్వహణను కొనసాగించారు. ఆ పత్రిక మాధ్యమంగా రామాయణాన్ని సరళమైన భాషలో ప్రామాణికమైన రీతిలో తెలుగు పాఠకులకు అందించారు. అది గ్రంథరూపంలో ప్రచురితమైంది.

జాతీయ సాహిత్య పరిషత్ తాండూరు శాఖ వారు డా.ఓగేటి అచ్యుత రామశాస్త్రి జాతీయ సాహిత్య పురస్కారంతో ఆయనను సన్మానించారు. విజయవాడలో సమాలోచన నిర్వహించిన కథా రచయితల సమ్మేళనం సార్వజనిక సభకు సాంబశివరావు అధ్యక్షులుగా వ్యవహరించారు.  భద్రాచలంలో జాగృతి పత్రిక నిర్వహించిన  కథా రచయితల సమ్మేళనంలోనూ ఆయన మార్గదర్శనం లభించింది. జాగృతి పత్రిక ఏటేటా నిర్వహించే కీ. శే వడ్లమూడి రామ్మోహనరావు స్మారకోపన్యాసానికి ఒకసారి అధ్యక్షులుగా ఉండి సభను ప్రేరణదాయకంగా నిర్వహించారు. తుమ్మల సీతారామమూర్తి చౌదరి కళాపీఠం వారు ఆయన రచనలన్నిటినీ పునర్ముద్రణ చేయించారు.

సాహితీ రంగానికి ఎన్నో విధాల , ఎంతగానో సేవ లందించిన సాంబశివరావుకు ప్రముఖ రచయిత, `జాగృతి’ మాజీ సంపాదకులు డా. వడ్డీ విజయ సారధి తెలుగు సాహితీరంగం తరఫున శిరసువంచి శతశత ప్రణామాలు సమర్పించారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం ఉదయం 9 గంటలకు బొంగరాలబీడు, పితృవనం మహాప్రస్థానంలో నిర్వహిస్తామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.