భారత నావికాదళంలోకి ఐఎన్‌ఎస్‌ అర్నాల

భారత నావికాదళంలోకి ఐఎన్‌ఎస్‌ అర్నాల

డైరెక్టరేట్‌ ఆఫ్‌ షిప్‌ ప్రొడక్షన్‌ మార్గదర్శకత్వంలో కోల్‌కతా కట్టుపల్లిలో తయారు చేసిన మొదటి యాంటీ-సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ షాలో వాటర్‌ క్రాఫ్ట్‌ నౌక ఐఎన్‌ఎస్‌ అర్నాల బుధవారం భారత నావికాదళంలోకి ప్రవేశించింది. విశాఖపట్నంలోని నేవల్‌ డాక్‌యార్డ్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ హాజరై నౌకను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం సమర్థవంతమైన నావికాదళాన్ని రూపొందించడం ద్వారా గణనీయమైన సముద్ర శక్తిగా పేరు సంపాదించుకుందని తెలిపారు. ప్రపంచ వాణిజ్యం, ఇంధన ప్రవాహాలకు సముద్ర మార్గాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, భౌగోళిక-రాజకీయ పరిస్థితి, నిరంతర సవాళ్లతో కూడిన భద్రతా వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని నావికాదళం బలంగా, అత్యాధునిక పరికరాలతో సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 

‘ఆపరేషన్‌ సిందూర్‌’ సమయంలో, క్యారియర్‌ బాటిల్‌ గ్రూప్‌తో సహా 36 భారతీయ నావికాదళ నౌకలను పలు ప్రాంతాల్లో మోహరించినట్లు చెప్పారు. తూర్పు నేవల్‌ కమాండ్‌ ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌-ఇన్‌-చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ రాజేష్‌ పెంధార్కర్‌ మాట్లాడుతూ పదహారు యాంటీ-సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ షాలో వాటర్‌ క్రాఫ్ట్‌ తరగతి నౌకలలో మొదటిది భారత నావికాదళంలోకి అధికారికంగా ప్రవేశించిందని తెలిపారు. 

కోల్‌కతాలోని మెస్సర్స్‌ గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌, ఇంజనీర్స్‌ ద్వారా, మెస్సర్స్‌ ఎల్‌అండ్‌టి షిప్‌ బిల్డర్స్‌తో పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్యం (పిపిపి) కింద నిర్మించబడిన ఈ నౌకను మే 8న భారత నావికాదళానికి అప్పగించారని తెలిపారు. ఈ యుద్ధనౌక 80 శాతం కంటే ఎక్కువ స్వదేశీ కంటెంట్‌ను కలిగి ఉందన్నారు. ఇది తీరప్రాంత రక్షణను బలోపేతం చేస్తుందని తెలిపారు. కీలకమైన హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర శక్తిగా భారతదేశం స్థానాన్ని ఇది నిలబెడుతుందని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ చైర్మన్‌ పిఆర్‌.హరి, వైస్‌ అడ్మిరల్స్‌ ఆర్‌.స్వామినాధన్‌, సమీర్‌ సక్సేన, బి.శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. సబ్‌సర్ఫేస్‌ సర్వైలెన్స్‌, సెర్చ్‌, రెస్క్యూ మిషన్‌లు, తక్కువ ఇంటెన్సిటీ మారిటైమ్‌ ఆపరేషన్‌లను నిర్వహించడానికి ఈ నౌకను నిర్మించారు. 1490 టన్నులకు పైగా బరువు కలిగి, 77.6 మీటర్ల పొడవైన యుద్ధనౌక. డీజిల్‌ ఇంజిన్‌-వాటర్‌జెట్‌ కలయిక ద్వారా నడపబడే తొలి అతిపెద్ద భారతీయ నావికా యుద్ధనౌక ఇదే.