కొల్లేరులో మానవ హక్కుల ఉల్లంఘన, ఉపాధి నిరాకరణ

కొల్లేరులో మానవ హక్కుల ఉల్లంఘన, ఉపాధి నిరాకరణ
కొల్లేరులో రోడ్లు సైతం వేసే పరిస్థితి లేకుండా పోవడంతో అభివృద్ధి జరగడం లేదని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని, జిరాయితీ, డి.ఫారం పట్టా భూముల్లో చెరువులన్నింటినీ ధ్వంసం చేయడంతో ఉపాధి లేక భూములున్నా నిరుపేదల్లా బతుకుతున్నామని కొల్లేరు ప్రజలు కేంద్ర సాధికారిక కమిటీకి విన్నవించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా చంద్రప్రకాష్‌ గోయల్‌, డాక్టర్‌ జెఆర్‌.భట్‌, జి.భానుమతి, సునీల్‌ లిమాయేతో కూడిన కేంద్ర సాధికారిక బృందం మంగళవారం జిల్లాకు విచ్చేసింది. 
 
తొలిరోజు కొల్లేరు గ్రామాల్లో పర్యటించగా, రెండోరోజు బుధవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో కొల్లేరు ప్రజల నుంచి వినతులు స్వీకరించింది. అనంతరం సంబంధిత శాఖలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వివరాలు తెలుసుకుంది. ఉంగుటూరు, దెందులూరు, ఉండి, కైకలూరు నియోజకవర్గాల్లోని కొల్లేరు ప్రజలంతా కమిటీకి తమ గోడు చెప్పుకునేందుకు వేలాది మంది ఏలూరుకు తరలొచ్చారు. 
 
జనం నుంచి వినతులు స్వీకరించిన అనంతరం పలువురు కొల్లేరు ప్రాంత నాయకులు మాట్లాడారు. కొల్లేరు నాయకులు నంబూరి వెంకటరామరాజు, శివాజీ, సైదు సత్యనారాయణ మాట్లాడుతూ సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం, ఫిషింగ్‌ చేయమనడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పర్యావరణాన్ని, పక్షులను కాపాడుతున్నది రైతులే అని పేర్కొన్నారు. పంటలకు ఉపయోగపడే కాలువలు బాగు చేయడం లేదని, వాటిని ఇరిగేషన్‌కు అప్పగించాలని కోరారు. 
 
కమిటీ నివేదికతో తమ జీవనం అధాపడి ఉందని పేర్కొంటూ 122 గ్రామాల్లో మూడు లక్షల మంది జనాభా ఉన్నారని, అధిక శాతం ఎస్‌సి, బిసి తరగతుల ప్రజలేనని తెలిపారు. జిరాయితీ, సొసైటీ భూములను పూర్తిగా ధ్వంసం చేయడంతో ఉపాధి లేకుండా పోయిందని, చిత్తడి నేలల నిర్థారణలోనూ లోపం జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు జోక్యం చేసుకుంటూ 1996లో ఐదో కాంటూరు సరిహద్దులు నిర్థారణ సందర్భంగా జరిగిన గ్రామసభల్లో అంతా అంగీకరించినట్లు ఉంది కదా? అని అడిగారు.
 
అప్పట్లో తమకు చదువులు లేవని ఒకరిద్దరితో అధికారులు మాట్లాడి మోసపూరిత నివేదికలు అందించారని ఆరోపించారు. తమకు తెలియకుండా జరిగిందని వినతి రూపంలో సమర్పించాలని కమిటీ సభ్యులు సూచించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మాట్లాడుతూ కొల్లేరు ప్రజలను అటవీశాఖ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని, టూరిజం అభివృద్ధి సైతం జరగకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. 
 
కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఇరిగేషన్‌, పొల్యూషన్‌, ఏలూరు కార్పొరేషన్‌, అటవీశాఖ అధికారులతో సాధికారిక కమిటీ ప్రత్యేకంగా సమావేశమై వివరాలు తీసుకుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్‌, పత్సమట్ల ధర్మరాజు, కలెక్టర్‌ వెట్రిసెల్వి, డిఆర్‌ఒ విశ్వేశ్వరరావు, అటవీశాఖ అధికారి విజయ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.