మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
ఆడవారి పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం చాలా పెద్ద నేరమని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చన మజుందార్‌ హెచ్చరించారు. రాష్ట్రంలో పర్యటించిన ఆమె మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో మహిళా కమిషన్‌ ఛైర్మన్ డా. రాయపాటి శైలజతో పాటు అక్కడి మహిళలతో సమావేశమయ్యారు. అమరావతి మహిళలపై మురికి వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేశామని వివరించారు. 

వారిని కించపరిచేలా టీవీ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై అధికారుల నుంచి నివేదిక కోరినట్లు తెలిపారు. నిందితులు క్షమాపణలు చెప్పినా సరిపోదన్నారు. వారికి కఠిన శిక్షపడేలా చూస్తామని పేర్కొన్నారు. అనంతరం అర్చన మజుందార్ విజయవాడలో సిద్ధార్థ వైద్య కళాశాల, పాత ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. దేశంలో మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా కఠిన చర్యలు తప్పవని అర్చన మజుందార్ హెచ్చరించారు. స్త్రీలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని చెప్పారు. పదికి మించి సిబ్బంది పని చేస్తున్న ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

మహిళల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై అందరికి తెలిసేలా బోర్టులు ఏర్పాటు చేయాలని అర్చన మజుందార్ అధికారులను ఆదేశించారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీని వారంలో ఏర్పాటు చేయాలని చెప్పారు. అనంతరం పాతాసుపత్రిలోని గైనకాలజీ వార్డు, పీడియాట్రి వార్డులను పరిశీలించారు. ఒక్క పడకపై ఇద్దరు, ముగ్గురు ఉండటాన్ని గమనించి అధికారులను ఆమె ప్రశ్నించారు. పక్కనే అదనపు భవనం నిర్మాణంలో ఉన్నట్లు అర్చన మజుందార్​కు అధికారులు తెలిపారు.

ఐసీసీ విభాగం ద్వారా బాధిత మహిళకు న్యాయం జరగకపోతే రాష్ట్ర, జాతీయ మహిళా కమిషన్‌ దృష్టికి తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్‌ ఛైర్మన్ డా. రాయపాటి శైలజ పేర్కొన్నారు. ప్రతి మహిళా ప్రశాంత వాతావరణంలో పనిచేసేలా మహిళా కమిషన్‌ చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డా.ఏ.ఏడుకొండలరావు, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్‌ డా.ఏవీ రావు తదితరులు పాల్గొన్నారు.