ఏపీలో వారానికి ఒకరోజు నో వెహికల్‌ డే

ఏపీలో వారానికి ఒకరోజు నో వెహికల్‌ డే

ఇంధన పొదుపు చర్యలలో భాగంగా వారానికి ఒక రోజు నో వెహికల్ డేను పాటించాలని ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం సమావేశమై వాహనాలు కాకుండా ప్రత్యామ్నాయ రవాణాపై దృష్టిపెట్టాలని నిర్ణంయ తీసుకున్నారు. ‘నాదేశం – నా బాధ్యత’ పేరుతో పొదుపుపై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని క్యాబినెట్ తీర్మానించింది. ఇకపై కొన్నాళ్ల పాటు మంత్రుల విదేశీ పర్యటనలు కూడా రద్దు చేశారు. 

మంత్రులు ప్రజా రవాణాలో కానీ, ఈవీ వెహికల్, సైకిల్‌ను వినియోగించాలని నిర్ణయించింది. జిల్లాల పర్యటనలలోనూ కాస్ట్ కటింగ్ పాటించాలని, మెజారిటీ సమావేశాలను వర్చువల్‌గా నిర్వహించాలని, ప్రెజెన్స్ అవసరం లేని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అమలు చేయాలని తీర్మానం చేశారు. అలాగే, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల ఉష్ణోగ్రత 24 నుంచి 27 మధ్య నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. 

ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఖర్చులు తగ్గించాలని, సోలార్ ఎనర్జీనే ఎక్కువ వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, మంత్రుల నుంచి అధికారుల వరకు వాహనాల సంఖ్యను, వినియోగాన్ని తగ్గించాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు మాత్రమే తమ కాన్వాయ్‌లు తగ్గించుకుంటే సరిపోదని, ఇతర ప్రత్యామ్నాయాలు చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. 

‘‘నా దేశం-నా బాధ్యత’ పేరిట రాష్ట్రంలో విస్తృతంగా పొదుపు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశా నిర్ధేశం చేశారు.  పొదుపు చర్యల్లో ప్రతి ఒక్కరిని భాగం చేయాలని, దీనికోసం విస్తృతంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు సిఎం చెప్పారు.  విద్యుత్‌ ‌వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని, సౌర విద్యుత్ విధానాన్ని కూడా పెద్ద ఎత్తున అందిపుచ్చకునేలా చూడాలని సూచించారు.

ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని చంద్రబాబు విజ్ఞ‌ప్తి చేశారు.  ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ పొదుపు చర్యలు ఒక్కసారిగా ప్రజల్ని భయపెట్టేలా ఉండకూడదని, దశల వారీగా చేపడదామని సూచించారు. ప్రతి నిర్ణయాన్ని 48 గంటల ముందుగానే చెప్పి, ప్రజలను సన్నద్దం చేద్దామని సిఎం చెప్పారు. వివిధ శాఖల పరిధిలో పొదుపు చర్యలు, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలపై అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించాలని కోరారు. 

రాష్ట్రంలో దాదాపు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే 25 ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తిరుపతిలో రూ.2,500 కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటర్ సైకిళ్ల తయారీ యూనిట్, విశాఖలో 1 లక్ష కోట్ల రూపాయలతో రిలయన్స్ డేటా సెంటర్‌ ఏర్పాటు, సత్యసాయి జిల్లాలో 51 వేల కోట్ల రూపాయలతో సోలార్ పవర్ ప్లాంట్, కడపలో 12 వేల కోట్ల రూపాయలతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ వంటి కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు మంత్రివర్గం పచ్చజెండా ఉంపింది.